
America: అమెరికాలో ఉద్యోగాల వృద్ధి క్షీణిస్తోంది.. జాబ్ మార్కెట్‌పై మూడీస్ ఆందోళన
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి ఆందోళనకర దిశగా వెళ్తోందని ప్రముఖ ఆర్థిక సంస్థ 'మూడీస్ అనలిటిక్స్' హెచ్చరించింది. అమెరికన్ల ఉద్యోగ భవిష్యత్తు ఇప్పుడు ప్రధానంగా కేవలం రెండు రంగాలపైనే ఆధారపడి ఉందని,ఇది ఆర్థిక మాంద్యానికి సంకేతమని మూడీస్ ముఖ్య ఆర్థికవేత్త 'మార్క్ జాండీ' స్పష్టం చేశారు. హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ రంగాలే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించాయి.ఈ రెండు రంగాలు లేకపోతే, అమెరికాలో కొత్త ఉద్యోగాల వృద్ధి దాదాపు సున్నాకు చేరుకునేదని జాండీ పేర్కొన్నారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్(BLS)గణాంకాల ప్రకారం గత ఆరు నెలలుగా సగానికి తగ్గ పరిశ్రమలే కొత్త ఉద్యోగాలను కల్పిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి సాధారణంగా ఆర్థిక మాంద్యం సమయంలోనే కనిపిస్తుందని ఆయన హెచ్చరించారు.
Details
'Jobs Recession' భయం
మార్క్ జాండీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో స్పష్టంగా ఇది ఒక ఉద్యోగాల మాంద్యం (Jobs Recession) అని పేర్కొన్నారు. జూన్ నెలలో ఉద్యోగాల వృద్ధి గణనీయంగా తగ్గిందని, జూలై-ఆగస్టులో కొద్దిగా పెరుగుదల కనిపించినా అది భవిష్యత్తులో సవరించబడే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
Details
కీలక రంగాల్లో ఉద్యోగాల నష్టం
మాన్యుఫ్యాక్చరింగ్, మైనింగ్, కన్‌స్ట్రక్షన్ వంటి ప్రధాన రంగాలు ఉద్యోగాలను కోల్పోతున్నాయి. మరోవైపు హెల్త్‌కేర్, హాస్పిటాలిటీ రంగాలు మాత్రమే కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నాయి. మొత్తం దృశ్యాన్ని చూస్తే - జీడీపీ, ఆదాయాలు, లాభాలు కొద్దిగా పెరుగుతున్నందువల్ల ఇది పూర్తిస్థాయి మాంద్యం కాదని జాండీ చెప్పారు. అయితే ఉద్యోగాలు కోల్పోవడం ఇదే తరహాలో కొనసాగితే, ఈ సానుకూల వృద్ధి ఎంతకాలం నిలుస్తుందో చెప్పడం కష్టమని ఆయన హెచ్చరించారు.
Details
నిరుద్యోగ గణాంకాలు స్పష్టతనిచ్చిన డేటా
జాండీ ఆందోళనకు కారణం బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసిన తాజా ఉద్యోగ గణాంకాలే. వాటి ప్రకారం అమెరికాలో నిరుద్యోగ రేటు పెరిగింది. జూలై 2025లో 4.2%గా ఉన్న నిరుద్యోగం, ఆగస్టులో 4.3%కు చేరింది. అదే సమయంలో జూలైలో 79,000 ఉద్యోగాల వృద్ధి కనిపించగా, ఆగస్టులో కేవలం 22,000 కొత్త ఉద్యోగాలకే పరిమితమైంది. ఈ గణాంకాలు అమెరికా ఉద్యోగ మార్కెట్ బలహీనపడుతోందన్న భయాలను మరింత బలపరచాయి.