LOADING...
Hunter Biden: అప్పుల భారంతో అమెరికాను వీడిన జో బైడన్ కుమారుడు
అప్పుల భారంతో అమెరికాను వీడిన జో బైడన్ కుమారుడు

Hunter Biden: అప్పుల భారంతో అమెరికాను వీడిన జో బైడన్ కుమారుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 11, 2026
05:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా (US) మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్(Hunter Biden)దేశాన్ని వీడినట్లు సమాచారం. హంటర్ బైడెన్ ప్రస్తుతం విదేశాల్లో నివసిస్తున్నారని ఆయన న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారన్న విషయంపై తనకూ స్పష్టత లేదని న్యాయవాది తెలిపారు. తనకు చెల్లించాల్సిన 50,000 డాలర్ల బకాయిలను కూడా హంటర్ చెల్లించలేదని కోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనపై మొత్తం 17 మిలియన్ డాలర్ల (సుమారు రూ.158 కోట్లు) అప్పు ఉన్న నేపథ్యంలో దేశాన్ని వీడటం చర్చనీయాంశంగా మారింది. గతేడాది ఓ ఇంటర్వ్యూలో కూడా తాను అప్పుల్లో కూరుకుపోయినట్లు హంటర్ బైడెన్ స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఆయన దక్షిణాఫ్రికాలో ఉండే అవకాశం ఉందని అమెరికా అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

వివరాలు

హంటర్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదు

హంటర్‌పై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. 2018లో తుపాకీ కొనుగోలు సమయంలో దరఖాస్తు ఫారంలో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. తాను డ్రగ్స్‌కు బానిస కాదని, అక్రమంగా ఆయుధం కలిగి లేనని పేర్కొన్నప్పటికీ, అది తప్పని తేలింది. అప్పటికే ఆయన డ్రగ్స్ వినియోగించినట్లు విచారణలో వెల్లడైంది. అలాగే కాలిఫోర్నియాలో 1.4మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత ఆరోపణలపై కూడా కేసు నమోదైంది. అక్రమ ఆయుధ కొనుగోలు కేసులో 2024 జూన్‌లో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. అయితే అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే సమయంలో జో బైడెన్ తన కుమారుడికి అక్రమ ఆయుధం కేసుతో పాటు మరో క్రిమినల్ కేసులో క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవేనని ఆయన అప్పట్లో ఆరోపించారు.

Advertisement