Karachi: కరాచీలో ఉగ్రదాడి.. పేలుడు, కాల్పులతో ఉద్రిక్త పరిస్థితి.. ఆరుగురు ఉగ్రవాదులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌లోని అతిపెద్ద నగరం కరాచీలో శనివారం తీవ్ర ఉగ్రదాడి చోటుచేసుకుంది. నగరంలోని సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన అనంతరం జరిగిన కాల్పుల్లో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో అనుమానిత ఉగ్రవాదిని సజీవంగా అదుపులోకి తీసుకున్నారు. కరాచీలోని గులిస్తాన్-ఎ-జౌహర్ ప్రాంతంలో ఉన్న సింధ్ రేంజర్ల ప్రధాన కార్యాలయంపైకి పేలుడు పదార్థాలతో నిండిన వాహనాన్ని ఉగ్రవాదులు దూసుకెళ్లారు. వాహనం స్థావరాన్ని ఢీకొన్న వెంటనే భారీ పేలుడు సంభవించింది. అనంతరం అక్కడే ఉన్న ఇతర ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించారు.
వివరాలు
పాక్ భద్రతా దళాలే లక్ష్యంగా దాడులు..
వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరపడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రత్యేక పోలీసు బలగాలు, కమాండోలను మోహరించారు. ఈ దాడికి తామే బాధ్యులమని తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (టిటిపి) నుంచి విడిపోయిన 'జమాత్-ఉల్-అహ్రార్' ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌లో భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాద దాడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
వివరాలు
సయ్యద్ మురాద్ అలీ షా తీవ్ర ఆందోళన..
ఈ ఉగ్రదాడిపై సింధ్ ముఖ్యమంత్రి సయ్యద్ మురాద్ అలీ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం భద్రతా బలగాలు మొత్తం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ఘటనలో సాధారణ పౌరులకు ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు.