
Modi-Trump: గాజా వివాదంలో కీలక మలుపు.. ట్రంప్ నాయకత్వంపై మోదీ ప్రశంసలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రశంసించారు. గాజాలో శాంతి స్థాపనకు ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తూ, శాశ్వతం, న్యాయం కలిగిన శాంతి కోసం భారత్ ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తుందని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. హమాస్ ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని ప్రకటించడం శాంతి ప్రక్రియలో కీలక ముందడుగు అని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నాయకత్వాన్ని స్వాగతిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇటీవల ట్రంప్ గాజా సమస్య పరిష్కారానికి 20 పాయింట్ల ప్రణాళికను ప్రకటించారు. దీనిని ఇజ్రాయెల్ వెంటనే ఆమోదించినప్పటికీ, హమాస్ తొలుత స్పందించలేదు.
Details
వెనక్కి తగ్గిన హమాస్
అయితే ట్రంప్ ప్రణాళికకు పలు దేశాలు స్వాగతం పలికాయి. అదే విధంగా ప్రధాని మోదీ కూడా దీన్ని సమర్థించారు. హమాస్ నిర్లక్ష్య వైఖరిపై ట్రంప్ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు ప్రణాళికను ఆమోదించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించడంతో, చివరికి హమాస్ వెనక్కి తగ్గింది. ట్రంప్ ప్రతిపాదనలోని కొన్ని అంశాలను అంగీకరిస్తున్నట్లు ప్రకటించడంతో పాటు, ఒకేసారి ఇజ్రాయెల్ బందీలను విడుదల చేస్తామని కూడా వెల్లడించింది.
Details
బందీల విడుదలకు సిద్ధమైన హమాస్
గమనించదగిన విషయం ఏమిటంటే, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 250 మందికిపైగా పౌరులను బందీలుగా తీసుకెళ్లారు. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ హమాస్‌పై దాడులు జరిపింది. ఆ తరువాత నుండి యుద్ధం కొనసాగుతూనే ఉంది. మధ్యలో అంతర్జాతీయ మధ్యవర్తుల జోక్యంతో కొంతమంది బందీలు విడుదలైనప్పటికీ, ఇజ్రాయెల్ ఒకేసారి అందరినీ విడిచిపెట్టాలని షరతు పెట్టింది. దీనికి హమాస్ అంగీకరించలేదు. కానీ ఇప్పుడు హమాస్ తన నిర్ణయంలో మార్పు చేసి బందీల విడుదలకు సిద్ధం కావడంతో, ప్రతిగా పాలస్తీనా ఖైదీల విడుదలకు కూడా మార్గం సుగమం అవుతోంది.