Iran : ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి సిద్ధం.. ఇరాన్ సుప్రీం లీడర్ ఆదేశాలు
టెహ్రాన్‌లో హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఎలాగైనా ఇజ్రాయెల్ పై ప్రత్యక్షంగా దాడి చేసి ప్రతీకారం తీసుకోవాలని ఇరాన్ అగ్రనేత అయతుల్లా అలీ ఖమేనీ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఇక హనియే మృతితో బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా బేటీ అయింది. ఈ సమావేశంలోనే ఆయన ఆదేశాలిచ్చినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది. ఇంతకు ముందు ఏప్రిల్‌లో, సిరియాలో ఇజ్రాయెల్ వైమానిక దాడిలో ఇద్దరు ఇరాన్ సైనిక కమాండర్లు మరణించిన తర్వాత ఇదే విధంగా సమావేశం జరిగింది.
హమాస్ హత్యకు ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపణ
హమాస్ హత్యకు ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇక ఇరాన్ ఎలా స్పందిస్తుందోనని యావత్ ప్రపంచం ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఖమేనీ తాజా ఆదేశాల సమాచారం కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్ దాడులకు దిగితే పశ్చిమాసియా మరోసారి తీవ్ర ఘర్షణలకు వేదిక కానుంది. గాజాలో హమాస్‌పై యుద్ధం ప్రారంభించి పది నెలలవుతున్న విషయం తెలిసిందే. ఇరాన్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రెస్ టీవీ ప్రకారం, హమాస్ నాయకుడు ఇస్మాయిల్ హనియా అంత్యక్రియలకు గురువారం అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహిస్తారు.