Iran Supreme Leader: ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఖమేనీ.. రెండు రోజుల్లోనే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్!
గత వారం ఇజ్రాయెల్ ఇరాన్‌పై జరిపిన దాడుల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఈ దాడుల ద్వారా టెహ్రాన్‌కు భారీ నష్టం కలిగించామని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్ సుప్రీంనేత అయాతుల్లా అలీ ఖమేనీ చేసిన ఒక సామాజిక పోస్ట్ వివాదాస్పదంగా మారింది. ఇజ్రాయెల్‌పై హెచ్చరికలతో ఖమేనీ హిబ్రూ భాషలో కొత్తగా తెరిచిన 'ఎక్స్' ఖాతా ద్వారా సందేశాన్ని పంపారు. అయితే ఈ ఖాతాను రెండు రోజులకే 'ఎక్స్' సస్పెండ్ చేసింది.
ఖమేనీ పేరుతో మరో ఖాతా
ఇజ్రాయెల్ దాడులు జరిగిన కొన్ని గంటల తర్వాత ఖమేనీ, హిబ్రూ భాషలో ఖాతాను ప్రారంభించి ఇరాన్‌ను తక్కువ అంచనా వేయడం జియోనిస్టులకు తీవ్ర తప్పు అని, ఇరాన్ శక్తి, సామర్థ్యం, చొరవను చూపిస్తామంటూ హెచ్చరికతో కూడిన పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై వివాదం చెలరేగడంతో, మైక్రో బ్లాగింగ్ సైట్ ఈ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఖమేనీ పేరుతో ఉన్న మరో అధికారిక ఖాతా యథావిధిగా కొనసాగుతుండటం గమనార్హం.
ఖమేనీ ఆరోగ్యంపై పుకార్లు
అయాతుల్లా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు సమాచారం. ఇటీవల ఆయన తీవ్రమైన కడుపునొప్పి, జ్వరంతో బాధపడగా, అధికారిక నివాసంలోనే అత్యాధునిక వైద్యసదుపాయాలతో శస్త్రచికిత్స జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంత మెరుగుపడిందని, విశ్రాంతి తీసుకుంటున్నారని ఇరాన్ మీడియా కథనాలు పేర్కొన్నాయి.