Loading...
Mojtaba Khamenei: అమెరికా దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే: ఖమేనీ
అమెరికా దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే: ఖమేనీ

Mojtaba Khamenei: అమెరికా దాడులు కొనసాగితే భారీ మూల్యం చెల్లించాల్సిందే: ఖమేనీ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా దాడులు కొనసాగితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాకు ఎప్పటికీ మరచిపోలేని గుణపాఠం చెబుతామని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సంతకానికి ఇప్పుడు ఎలాంటి విలువ లేదని, అది పూర్తిగా నిష్ప్రయోజనమైందని వ్యాఖ్యానించారు. అమెరికా కొనసాగిస్తున్న సైనిక దాడులకు నిరసనగా, ఇరుదేశాల మధ్య కుదిరిన ఒప్పందంలోని తమ హామీల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటించిన కొద్దిసేపటికే ఖమేనీ ఈ సందేశాన్ని విడుదల చేశారు. ఆ సందేశాన్ని ఇరాన్‌ ప్రభుత్వ టెలివిజన్‌ ప్రసారం చేసింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఖమేనీ బహిరంగంగా ప్రజల ముందుకు రాకపోవడం గమనార్హం.

వివరాలు 

రెండు దేశాల మధ్య శనివారం కూడా పరస్పర దాడులు

అమెరికా మరోసారి తన అసలు వైఖరిని బయటపెట్టుకుందని ఖమేనీ విమర్శించారు. విశ్వాసాన్ని ద్రోహం చేసిన దేశంగా అమెరికా నిలిచిందని ఆరోపించారు.

దాడులు ఇదే విధంగా కొనసాగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఇరాన్‌ సైనిక బలగాల సామర్థ్యాన్ని అమెరికా తక్కువ అంచనా వేయొద్దని, అవసరమైతే కఠిన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో రెండు దేశాల మధ్య శనివారం కూడా పరస్పర దాడులు కొనసాగాయి.

ఈసారి యుద్ధం మరింత విస్తరించి వ్యూహాత్మకంగా కీలకమైన నీటి వనరులు, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంది.

వివరాలు 

హర్మూజ్‌ ప్రాంతంలో తీవ్రత

ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్‌ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

వరుసగా ఏడోరోజు అమెరికా దాడులు కొనసాగించింది.

ఇరాన్‌లోని నిఘా కేంద్రాలు,సైనిక రవాణా వ్యవస్థలు,భూగర్భ ఆయుధ నిల్వలు,సముద్ర రక్షణ సామర్థ్యాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో ఇరాన్‌లోని రెండు సొరంగాలు,ఒక వంతెన దెబ్బతినడంతో బందర్‌ అబ్బాస్‌ జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌ కువైట్‌లోని డీశాలినేషన్‌ ప్లాంట్‌,చమురు క్షేత్రాలపై దాడులు చేసింది.

ఈ ఘటనలో పలువురు గాయపడగా, డీశాలినేషన్‌ ప్లాంట్‌కు భారీ నష్టం వాటిల్లింది.

పలు విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు నిలిచిపోయాయి.దాడుల వల్ల చెలరేగిన అగ్నిప్రమాదాలను అదుపు చేసే ప్రయత్నంలో పలువురు సిబ్బంది గాయపడ్డారు.

పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కొంతసేపు కువైట్‌ గగనతలాన్ని మూసివేశారు.

ADVERTISEMENT

వివరాలు 

సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలో పలుమార్లు హెచ్చరిక సైరన్లు

ఇరాక్‌లోని ఇర్బిల్‌ నగరాన్ని లక్ష్యంగా చేసుకుని వచ్చిన డ్రోన్‌లను విజయవంతంగా అడ్డుకున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

అలాగే ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేశాయని జోర్డాన్‌ వెల్లడించింది.

ఇక తమ సైనిక స్థావరంపై శుక్రవారం జరిగిన ఇరాన్‌ దాడిలో ఇద్దరు అమెరికా సైనికులు మరణించగా, మరో సైనికుడు గల్లంతైనట్లు అమెరికా సైన్యం తెలిపింది.

సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలో పలుమార్లు హెచ్చరిక సైరన్లు మోగాయి.

ADVERTISEMENT

వివరాలు 

నీటి వనరులపైకి మళ్లిన యుద్ధం

ఇప్పటివరకు ఇరాన్‌-అమెరికా ఘర్షణలో ప్రధానంగా చమురు క్షేత్రాలు, ఆయుధ నిల్వలు, సైనిక స్థావరాలే లక్ష్యాలుగా నిలిచాయి.

అయితే తాజాగా యుద్ధ వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. డీశాలినేషన్‌ ప్లాంట్లు, తాగునీటి వనరులు, నీటి సరఫరా వ్యవస్థలపై దాడులు పెరుగుతున్నాయి.

ఈ పరిణామం పశ్చిమాసియాలో ఆందోళన కలిగిస్తోంది. నీటి సరఫరా దెబ్బతింటే ప్రజలతో పాటు సైనిక బలగాలపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

అంతేకాకుండా, ప్రాంతంలో మానవతా సంక్షోభం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

వివరాలు 

ఇరాన్‌లో అంతర్గత అసంతృప్తి

అమెరికాతో చర్చల విషయంలో ప్రభుత్వ వైఖరిపై ఇరాన్‌లోని అతివాద వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.

అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌తో పాటు పలువురు సీనియర్‌ నేతల తీరుపై వారు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా ఈ అసంతృప్తి మరింత బహిర్గతమైంది. నాయకత్వంపై కుట్రలు, ద్రోహం,రాజీ రాజకీయాల ఆరోపణలు వినిపించాయి.

ఖమేనీ మృతదేహం పక్కన అధ్యక్షుడు పెజెష్కియాన్‌ నడవడాన్ని వ్యతిరేకించిన కొందరు అతివాదులు, రాజీపడిన వారికి మరణమే శిక్ష అంటూ నినాదాలు చేశారు.

అమెరికాతో చర్చల్లో కీలక పాత్ర పోషించిన విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీపై రాళ్ల దాడి జరగడంతో ఆయన అంత్యక్రియల కార్యక్రమాన్ని మధ్యలోనే విడిచిపెట్టాల్సి వచ్చింది.

వివరాలు 

ఇరాన్‌లో అంతర్గత అసంతృప్తి

అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఖమేనీ విప్లవ వారసత్వాన్ని ప్రస్తుత నాయకత్వం బలహీనపరిచిందని అతివాదులు ఆరోపిస్తున్నారు.

ఇంత జరుగుతున్నప్పటికీ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడంపై కూడా ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

ఆయన పరిస్థితిని నియంత్రించలేకపోతున్నారా? లేక ఆయన చుట్టూ ఉన్నవారే ఆయనను పూర్తిగా ఒంటరిగా ఉంచారా? అనే సందేహాలను కూడా అతివాద వర్గాలు బహిరంగంగా వ్యక్తం చేస్తున్నాయి.

ADVERTISEMENT