Kharg Island|: ఇరాన్ యుద్ధం వేడెక్కుతోంది.. ఖర్గ్ ద్వీపం టార్గెట్ అవుతుందా..?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌తో పాటు అల్బోర్జ్ ప్రాంతంలోని నాలుగు చమురు నిల్వ కేంద్రాలు, ఉత్పత్తి కేంద్రాలపై ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ఈ దాడులతో ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి. ఇదే సమయంలో ఒక చిన్న ద్వీపం పేరు అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. అదే ప్రపంచ ఇంధన ఎగుమతుల్లో కీలకమైన ఖర్గ్ ఐలాండ్ (Kharg Island). ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఈ ద్వీపాన్ని మాత్రం ఎవరూ లక్ష్యంగా చేసుకోలేదు. అయితే దీనిపై దాడి చేయాలా అనే అంశంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
వివరాలు
ఏంటి ఖర్గ్ ఐలాండ్..?
పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న చిన్న ద్వీపమే ఖర్గ్ ఐలాండ్.ఇది ఇరాన్ తీరానికి సుమారు 25 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. పరిమాణంలో చిన్నదే అయినా ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో దీని ప్రాధాన్యం చాలా పెద్దది. ఈ ద్వీపం ఇరాన్‌కు ప్రధాన చమురు ఎగుమతి టర్మినల్‌గా పనిచేస్తోంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం,ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90శాతం కార్యకలాపాలు ఇక్కడి నుంచే జరుగుతాయి. ఖర్గ్‌లో ఉన్న లోడింగ్ టర్మినళ్లు రోజుకు సుమారు ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును హ్యాండిల్ చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. 1960ల నుంచి విదేశీ పెట్టుబడులు పెరగడంతో ఈ ద్వీపం ఇరాన్ ఇంధన ఎగుమతులకు కీలక కేంద్రంగా మారింది.
వివరాలు
ద్వీపంపై దాడి జరిగితే.. ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం
దేశంలోని చమురు క్షేత్రాలను అంతర్జాతీయ మార్కెట్లతో కలిపే ప్రధాన లింక్‌గా ఖర్గ్ ఐలాండ్ పనిచేస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నాయి. అయితే ఖర్గ్ ఐలాండ్‌ను మాత్రం ఇప్పటివరకు టార్గెట్ చేయలేదు. ఈ ద్వీపంపై దాడి జరిగితే లేదా కార్యకలాపాలు నిలిచిపోయినా ఇరాన్ చమురు ఎగుమతులు తీవ్రంగా ప్రభావితం అవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ద్వీపం హర్మూజ్ జలసంధికి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ ఏవైనా సమస్యలు ఏర్పడితే ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం పడే అవకాశముంది.
వివరాలు
యుద్ధంలో దూకుడుగా ఇరాన్.. అమెరికాకు సవాల్
అలాగే చమురు ట్యాంకర్ల రాకపోకలకు కూడా ఆటంకం కలగొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని బలగాలు ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నప్పటికీ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధంలో దూకుడుగా వ్యవహరిస్తూ అమెరికాకు సవాల్ విసురుతోంది. అదే సమయంలో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఖర్గ్ ఐలాండ్‌ను లక్ష్యంగా చేసుకుంటే ఆ దేశ పోరాట సామర్థ్యాన్ని దెబ్బతీయొచ్చని ట్రంప్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ద్వీపాన్ని టార్గెట్ చేస్తే ఇరాన్‌కు వచ్చే చమురు ఆదాయంపై భారీ ప్రభావం పడుతుందని అమెరికా అంచనా వేస్తోంది.
వివరాలు
ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేస్తే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు
యుద్ధ సమయంలో ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఇది ఉపయోగపడుతుందని కూడా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేస్తే గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ప్రపంచ ఇంధన మార్కెట్లకు కూడా తీవ్ర అంతరాయం కలగవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ ఈ ద్వీపంపై దాడి జరిగితే యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని, ఇప్పటికే పెరుగుతున్న చమురు ధరలు మరింత ఎగసిపడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.