North Korea: జూన్ 9 తర్వాత కనిపించని కిమ్.. ఉత్తర కొరియాలో ఏం జరుగుతోంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గత రెండు నెలలుగా బహిరంగంగా కనిపించకపోవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా క్షిపణి ప్రయోగాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాలు, ఫ్యాక్టరీలు, ఇతర కీలక ప్రాజెక్టుల ప్రారంభ కార్యక్రమాల్లో తరచూ కనిపించే కిమ్.. కొంతకాలంగా ఎలాంటి బహిరంగ కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ఉత్తర కొరియాలోనూ ఇటీవల కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు పెద్దగా జరగడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆయన కనిపించకపోవడంతో అసలు కిమ్ ఎక్కడ ఉన్నారు? ఆయనకు ఏమైంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వివరాలు
జూన్ 9 తర్వాత కనిపించని కిమ్
'డైలీ స్టార్' నివేదిక ప్రకారం.. కిమ్ జోంగ్ ఉన్ చివరిసారిగా జూన్ 9న బహిరంగంగా కనిపించినట్లు సమాచారం.
ఆ రోజు చైనా నుంచి వచ్చిన ప్రతినిధులతో ఆయన సమావేశమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత కిమ్ పెద్దగా బయటకు వచ్చిన దాఖలాలు కనిపించలేదు.
ఉత్తర కొరియాలో చిన్న స్థాయి కార్యక్రమాల నుంచి భారీ భవనాలు, ఫ్యాక్టరీల ప్రారంభోత్సవాల వరకు కిమ్ హాజరు కావడం సాధారణం.
ఈ కార్యక్రమాలకు అక్కడి అధికారిక మీడియా కూడా భారీ ప్రచారం కల్పిస్తుంది. అయితే ఇటీవల జరిగిన పలు కార్యక్రమాల్లో కిమ్‌కు బదులుగా ఉన్నతాధికారులే పాల్గొంటున్నారు.
ఇటీవల రాజధాని ప్యాంగ్యాంగ్‌లోని కిమ్ జోంగ్ థే ఎలక్ట్రిక్ లోకోమోటివ్ కాంప్లెక్స్‌లో ఓ కార్యక్రమం జరిగింది.
వివరాలు
బహిరంగ కార్యక్రమాలకు దూరం
అలాగే నాంఫోలో పిల్లల కోసం నిర్మించిన స్కూల్ చిల్డ్రన్ ప్యాలెస్‌ను ప్రారంభించారు. ఈ రెండు కార్యక్రమాలకూ కిమ్ హాజరు కాలేదు.
ఆయన స్థానంలో ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లోకోమోటివ్ కార్యక్రమానికి ప్రధాని పాక్ థే సాంగ్ హాజరయ్యారు.
కేవలం బహిరంగ కార్యక్రమాలకే పరిమితం కాకుండా.. అంతర్గత ప్రభుత్వ సమావేశాల్లో కూడా కిమ్ జోంగ్ ఉన్ జాడ కనిపించకపోవడం ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
వివరాలు
37 డిగ్రీల వేడి.. అందుకే బయటకు రావడం లేదా?
కిమ్ ఎందుకు కనిపించడం లేదనే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం లేదు. అయితే కొందరు విశ్లేషకులు ఉత్తర కొరియాలో నెలకొన్న తీవ్రమైన వాతావరణ పరిస్థితులను కారణంగా చెబుతున్నారు.
ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు చేరినట్లు సమాచారం. దీనికి అధిక తేమ కూడా తోడవుతోంది.
ఈ కారణంగా కిమ్ తన ఆరోగ్యం, విశ్రాంతికి ప్రాధాన్యం ఇస్తూ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే గతంలోనూ ఇలాంటి అధిక ఉష్ణోగ్రతలు ఉన్న సమయంలో కిమ్ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొన్న విషయాన్ని పలువురు విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
దీంతో కేవలం వాతావరణమే ఆయన కనిపించకపోవడానికి కారణమా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
చనిపోయాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం
కిమ్ జోంగ్ ఉన్ చాలా కాలంగా బహిరంగంగా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి.
ఆయన ఆరోగ్యం దెబ్బతిందని కొందరు ప్రచారం చేస్తుండగా.. మరికొందరు ఏకంగా కిమ్ మరణించారంటూ కొత్త వాదనలు తెరపైకి తీసుకొస్తున్నారు.
అంతేకాదు.. కిమ్ జోంగ్ ఉన్ స్థానంలో 'బాడీ డబుల్'ను ఉపయోగిస్తున్నారనే మరో వాదన కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అయితే కిమ్ నిజంగా ఎందుకు బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారనే దానిపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.
దీంతో ఆయన గైర్హాజరీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి, ఊహాగానాలు కొనసాగుతున్నాయి.