Zelenskyy: కిమ్ సేనలకు రష్యాలో ఆధునిక యుద్ధ శిక్షణ.. జెలెన్‌స్కీ సంచలన ఆరోపణలు
ఈ వార్తాకథనం ఏంటి
ఉక్రెయిన్‌పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు మద్దతుగా తమ సైన్యాన్ని పంపినట్లు ఉత్తర కొరియా ఇప్పటికే వెల్లడించింది. తాజాగా మరో 50 వేల మంది సైనికులను రష్యాకు పంపేందుకు ఆ దేశం సన్నాహాలు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్‌స్కీ ఆరోపించారు. మొదట్లో వందల సంఖ్యలో రష్యా తరఫున యుద్ధంలో పాల్గొన్న ఉత్తర కొరియా సైనికులు.. ప్రస్తుతం వేల సంఖ్యలో కనిపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఉత్తర కొరియా సైనికులు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటూనే ఆధునిక యుద్ధ తంత్రాలను అధ్యయనం చేస్తున్నారని జెలెన్‌స్కీ తెలిపారు. రష్యా ఆధ్వర్యంలో వారికి ఆధునిక యుద్ధంపై శిక్షణ లభిస్తోందని పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇతర ఆసియా దేశాలకు కూడా ముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
వివరాలు
దక్షిణ కొరియా సాయం కోరిన జెలెన్‌స్కీ
యుద్ధంలో అనుభవాన్ని సంపాదించిన తర్వాత రష్యా నుంచి లైసెన్సులు పొంది.. అన్ని రకాల సైనిక పరికరాలను పొందేలా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ వ్యూహరచన చేస్తున్నారని జెలెన్‌స్కీ ఆరోపించారు.
అంతేకాకుండా ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఉత్తర కొరియా తయారు చేసిన క్షిపణులను వినియోగించినట్లు తమ సైన్యం గుర్తించిందని తెలిపారు.
రష్యాను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు సహకరించాలని జెలెన్‌స్కీ దక్షిణ కొరియాను కోరారు.
ముఖ్యంగా గగనతల రక్షణ వ్యవస్థల విషయంలో తమ దేశం కొరతను ఎదుర్కొంటోందని తెలిపారు. ఈ రంగంతో పాటు అవసరమైన ఇతర అంశాల్లోనూ దక్షిణ కొరియా నుంచి మద్దతు పొందాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
వివరాలు
సెర్బియాలో జెలెన్‌స్కీ పర్యటన
యుద్ధంలో ఉక్రెయిన్‌కు అంతర్జాతీయ మద్దతును మరింత కూడగట్టేందుకు జెలెన్‌స్కీ దౌత్య ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
ఇందులో భాగంగా ఆయన సెర్బియాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ వుచిచ్‌తో సమావేశమైన అనంతరం జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. యూరోపియన్ యూనియన్‌లో చేరాలనే ఉమ్మడి లక్ష్యం కోసం ఉక్రెయిన్, సెర్బియా కలిసి పనిచేస్తాయని తెలిపారు.
అదే సమయంలో ఉక్రెయిన్‌కు మానవతా సహాయం అందించడంతో పాటు మౌలిక సదుపాయాలు, ఇంధన రంగానికి అవసరమైన పరికరాలను అందించేందుకు సెర్బియా ప్రభుత్వం అంగీకరించినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు.