
Plane Hijack: బెలిజ్‌లో విమానం హైజాక్‌కు యత్నం.. దుండగుడిని కాల్చిన ప్రయాణికుడు
ఈ వార్తాకథనం ఏంటి
గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానంలో దుండగుడు హైజాక్‌కు ప్రయత్నించిన ఘటన సెంట్రల్ అమెరికాలోని బెలీజ్ దేశంలో కలకలం రేపింది.
కత్తితో బెదిరిస్తూ విమానాన్ని తన నియంత్రణలోకి తీసుకోవాలన్న ప్రయత్నం చేసిన దుండగుడిని అక్కడే ఉన్న మరో ప్రయాణికుడు అడ్డుకొని తుపాకీతో కాల్చడంతో ఆ దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ట్రాపిక్ ఎయిర్‌కు చెందిన ఒక చిన్న విమానం గురువారం (అమెరికా కాలమానం ప్రకారం)బెలీజ్‌లోని కొరొజాల్ నుంచి శాన్ పెడ్రో వైపు బయలుదేరింది.
టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా వీరంగం సృష్టించాడు.
అతడు చేతిలో ఉన్న కత్తితో ప్రయాణికులను బెదిరిస్తూ విమానాన్ని హైజాక్ చేయడానికి ప్రయత్నించాడు.
అంతేగాక, విమానాన్ని బెలీజ్ దేశం వెలుపలికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశాడు.
వివరాలు
విమానంలో అప్పటికే 14 మంది ప్రయాణికులు
ఈ సంఘటనలో కొంతమంది ప్రయాణికులు గాయపడ్డారు. విమానంలో అప్పటికే 14 మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు.
దుండగుడి వేధింపులతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ పరిస్థితుల్లో ఓ ప్రయాణికుడు తన వద్ద ఉన్న లైసెన్స్ పొందిన తుపాకీతో దుండగుడిపై కాల్పులు జరిపాడు.
ఆ కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని బెలీజ్ అధికారులు అధికారికంగా వెల్లడించారు.
వివరాలు
హైజాక్‌కు యత్నించిన వ్యక్తి.. అకిన్యేలా సావా టేలర్
హైజాక్‌కు యత్నించిన వ్యక్తిని అమెరికాకు చెందిన అకిన్యేలా సావా టేలర్‌గా గుర్తించారు.
అతడు విమానంలోకి కత్తిని ఎలా తీసుకొచ్చాడనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని బెలీజ్ పోలీసులు వెల్లడించారు.
దుండగుడిపై కాల్పులు జరిపిన ప్రయాణికుడిని పోలీసులు సాహసవంతుడిగా, హీరోగా అభివర్ణించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానం సుమారు రెండు గంటల పాటు గాల్లో గుండ్రంగా తిరుగుతూ వేచి ఉండాల్సి వచ్చింది.
అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులు తీవ్ర మనస్తాపం ఎదుర్కొన్నప్పటికీ, మిగిలినవారు ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు.