LOADING...
Kremlin: ట్రంప్,పుతిన్ త్వరలో భేటీ.. వేదిక ఎక్కడంటే?
ట్రంప్,పుతిన్ త్వరలో భేటీ.. వేదిక ఎక్కడంటే?

Kremlin: ట్రంప్,పుతిన్ త్వరలో భేటీ.. వేదిక ఎక్కడంటే?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 08, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో వచ్చే వారం భేటీ జరపాలని తాను భావిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. ఈ సమావేశం బహుశా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు పుతిన్‌పై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. క్రెమ్లిన్‌లో యూఏఈ అధ్యక్షుడు జాయెద్ అల్ నహ్యాన్‌తో జరిగిన సమావేశం అనంతరం పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ భేటీ ప్రతిపాదన తమవేనని, అయితే ఇరువురికీ ఈ సమావేశంపై సమాన ఆసక్తి ఉందని ఆయన స్పష్టం చేశారు.

వివరాలు 

ఖరారు కానీ తేదీలు 

చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పాల్గొంటారా అన్న ప్రశ్నకు పుతిన్.. తాను దీనికి వ్యతిరేకం కాదని, గతంలో కూడా ఎన్నో సార్లు చెప్పినట్లు గుర్తు చేశారు. అయితే, అలాంటి భేటీకి కొన్ని ప్రత్యేక పరిస్థితులు అనుకూలంగా ఉండాలని ఆయన సూచించారు. ఇందుకు ముందు, రష్యా విదేశాంగ శాఖ సలహాదారు యూరి ఉషకోవ్ మాట్లాడుతూ.. ఈ శిఖరాగ్ర సమావేశం వచ్చే వారం జరిగే అవకాశముందని తెలిపారు. వేదిక విషయంలో సూత్రప్రాయ అంగీకారం కుదిరిందని ఆయన వెల్లడించారు, అయితే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదని చెప్పారు. జెలెన్‌స్కీ కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉందన్న వార్తలను ఉషకోవ్ తోసిపుచ్చారు.

వివరాలు 

పుతిన్ వ్యాఖ్యలపై స్పందించని అమెరికా అధ్యక్ష భవనం

పుతిన్-ట్రంప్ సమావేశం విజయవంతం కావడం ఫలప్రదం కావడం అత్యంత అవసరమని ఆయన అన్నారు. గతంలో యుద్ధానికి ముగింపు కోసం జెలెన్‌స్కీ భేటీ ప్రతిపాదించినప్పటికీ, పుతిన్ దానిని పట్టించుకోలేదని గుర్తుచేశారు. తాజాగా పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా అధ్యక్ష భవనం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. యుద్ధం ఆపకపోతే ఆర్థికపరమైన కఠిన ఆంక్షలు విధిస్తామని ట్రంప్ ముందే హెచ్చరించారు, ఆ హెచ్చరికల గడువు ఈ శుక్రవారంతో ముగియనుంది. ట్రంప్-పుతిన్ శిఖరాగ్రం తమ వైఖరిని స్పష్టంగా తెలియజేసే అవకాశమని రష్యా బుధవారం పేర్కొంది. అలాగే, అరుదైన ఖనిజాల తవ్వకాలు వంటి రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులకు సంబంధించిన ఆర్థిక అవకాశాలపై కూడా చర్చ జరగవచ్చని తెలిపింది.

వివరాలు 

యుద్ధంపై ఉక్రేనియన్ల అభిప్రాయం మార్పు 

2022లో యుద్ధం ప్రారంభమైనప్పుడు, రష్యాపై విజయం సాధించేదాకా పోరాటం కొనసాగించాలనే అభిప్రాయం ఉక్రెయిన్ ప్రజల్లో మూడొంతుల వరకూ ఉన్నది. కానీ తాజాగా నిర్వహించిన సర్వేలో పూర్తిగా భిన్నమైన ఫలితాలు బయటపడ్డాయి. యుద్ధాన్ని కొనసాగించాలనుకునే వారి శాతం గణనీయంగా తగ్గింది. బదులుగా, వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలికి, రష్యాతో ఒప్పందం చేసుకోవాలని మూడొంతుల మంది ఉక్రెయిన్ ప్రజలు కోరుకుంటున్నారని ఈ సర్వే వెల్లడించింది. ఈ అధ్యయనంలో, రష్యా ఆధీనంలోని ప్రాంతాలను మినహాయించి, మిగతా ఉక్రెయిన్ ప్రాంతాల్లో నివసిస్తున్న 15 సంవత్సరాలు పైబడిన వెయ్యి మందికి పైగా వ్యక్తుల అభిప్రాయాలను సేకరించినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.