Loading...
Kurdistan: కుర్దిస్థాన్ ప్రధాని కార్యాలయంపై డ్రోన్ల దాడి.. ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు
కుర్దిస్థాన్ ప్రధాని కార్యాలయంపై డ్రోన్ల దాడి.. ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు

Kurdistan: కుర్దిస్థాన్ ప్రధాని కార్యాలయంపై డ్రోన్ల దాడి.. ఇరాన్‌పై తీవ్ర ఆరోపణలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతీయ ప్రభుత్వ ప్రధాని మస్రూర్ బర్జానీ కార్యాలయంపై సోమవారం రాత్రి డ్రోన్ల దాడి జరిగింది. ప్రధాని కార్యాలయంతో పాటు కుర్దిస్థాన్ భద్రత, నిఘా సంస్థ 'పరాస్తిన్‌' అధిపతి నివాసాన్ని కూడా డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయని కుర్దిస్థాన్ భద్రతా సంస్థ వెల్లడించింది. అయితే ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని స్పష్టం చేసింది. ఇరాన్‌దే కుట్ర: కుర్దిస్థాన్ ఈ డ్రోన్ దాడుల వెనుక ఇరాన్‌ ఉందని కుర్దిస్థాన్ భద్రతా సంస్థ ఆరోపించింది. కీలకమైన ప్రభుత్వ, భద్రతా వ్యవస్థలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర ఆందోళన కలిగించే పరిణామమని పేర్కొంది. ఈ దాడులు కుర్దిస్థాన్ ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేందుకు ఇరాన్ చేపట్టిన తీవ్రమైన చర్యగా అభివర్ణించింది.

వివరాలు 

ప్రధాని బర్జానీ తీవ్ర ఖండన

తన కార్యాలయంపై జరిగిన డ్రోన్ దాడిని కుర్దిస్థాన్ ప్రధాని మస్రూర్ బర్జానీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం ఆమోదించలేమని, ఇది చట్టవిరుద్ధమైన చర్య అని పేర్కొన్నారు.

ఈ తరహా దాడులు ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచే ప్రమాదం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కుర్దిస్థాన్‌లో స్థిరత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇరాన్ ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు.

ఇరాన్ ఖండన

కుర్దిస్థాన్ చేసిన ఆరోపణలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. డ్రోన్ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది.

ఇరాన్‌పై నిందలు మోపేందుకు ఇతర శక్తులు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడి ఉండొచ్చని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ అనుమానం వ్యక్తం చేశారు.

వివరాలు 

మరింత ముదరనున్న ఉద్రిక్తతలు?

ఇరాక్‌లోని కుర్దిస్థాన్ ప్రాంతం ఇరాన్‌కు సమీపంలో ఉండటంతో ఇరు పక్షాల మధ్య కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఇరాన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న సంస్థలు, బలగాలకు కుర్దిస్థాన్‌లో స్థావరాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఈ నేపథ్యంలో తాజా డ్రోన్ దాడుల ఘటన కుర్దిస్థాన్-ఇరాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం కనిపిస్తోంది.

ADVERTISEMENT