Kuwait: సముద్ర మార్గంలో కువైట్‌లోకి చొరబాటు యత్నం.. ఇరాన్‌కు చెందిన నలుగురు అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి. గల్ఫ్ దేశాల మధ్య ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఇప్పటికే యూఏఈ ఇరాన్‌పై రహస్య దాడులకు పాల్పడినట్లు వార్తలు రావడంతో పరిస్థితులు వేడెక్కగా.. తాజాగా కువైట్ చేసిన ఆరోపణలు మరోసారి కలకలం రేపాయి. తమ భూభాగంలోకి అక్రమంగా చొరబడి బుబియాన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇరాన్ ప్రయత్నించిందని కువైట్ అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ పూర్తిగా ఖండించింది. కువైట్‌కు చెందిన బుబియాన్ ద్వీపం ఆ దేశంలోనే అతిపెద్ద ద్వీపంగా గుర్తింపు పొందింది. అక్కడ కీలక ఓడరేవులు, విద్యుత్ కేంద్రాలు, ఉపకేంద్రాలు, సైనిక స్థావరాలు ఉన్నాయి.
వివరాలు
ఈ ఘటనలో నలుగురు అరెస్టు
ఈ నెల ప్రారంభంలో చేపల పడవల ద్వారా సముద్ర మార్గంలో ద్వీపంలోకి ప్రవేశించేందుకు ఇరాన్‌కు చెందిన ఆరుగురు నౌకాదళ సిబ్బంది ప్రయత్నించారని కువైట్ ప్రభుత్వం తెలిపింది. వీరు ఇరాన్ విప్లవ గార్డు దళాల నౌకాదళానికి చెందినవారని ఆరోపించింది. ద్వీపంలో శత్రు కార్యకలాపాలు చేపట్టేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కువైట్ పేర్కొంది. అయితే తమ భద్రతా బలగాలు అప్రమత్తంగా స్పందించి చొరబాటును అడ్డుకున్నాయని వెల్లడించింది. ఈ ఘటనలో నలుగురిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు తప్పించుకున్నట్లు తెలిపింది. జరిగిన ఘర్షణల్లో కువైట్ సాయుధ దళాలకు చెందిన ఓ సిబ్బంది గాయపడినట్లు వెల్లడించింది.
వివరాలు
కువైట్ విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం
అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు తాము నౌకాదళానికి చెందినవారమని అంగీకరించినట్లు సమాచారం. వీరికి కువైట్ భూభాగంలో విధ్వంసక చర్యలు చేపట్టే బాధ్యత అప్పగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై కువైట్ విదేశాంగశాఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలను ఇరాన్ వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఈ ఆరోపణలను ఇరాన్ విదేశాంగశాఖ తోసిపుచ్చింది. తమ సిబ్బంది సాధారణ సముద్ర గస్తీ విధుల్లో ఉన్నారని పేర్కొంది. నౌకాయానానికి అంతరాయం కలగడంతో గల్ఫ్ ప్రాంత జలాల్లోకి వెళ్లాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాలపై దాడుల ప్రణాళికలు రూపొందించారన్న కువైట్ ఆరోపణలు అసత్యమని వెల్లడించింది.
వివరాలు
ఇరాన్‌పై సౌదీ అరేబియా కూడా రహస్య దాడులు
ఇదిలా ఉండగా.. ఇరాన్‌పై సౌదీ అరేబియా కూడా రహస్య దాడులు నిర్వహించినట్లు అంతర్జాతీయ మాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్నాయి. మార్చి నెలాఖరులో సౌదీ వైమానిక దళం ఈ చర్యలకు దిగినట్లు సమాచారం. అయితే దాడులు ఎక్కడ జరిగాయి.. ఏ లక్ష్యాలపై నిర్వహించారన్న విషయంలో స్పష్టత రాలేదు. ఈ అంశంపై ఇప్పటివరకు సౌదీ అరేబియా గానీ.. ఇరాన్ గానీ అధికారికంగా స్పందించలేదు.