దక్షిణ కొరియాలో ప్రకృతి విలయతాండవం.. 26మంది మృతి, వేలాది నిరాశ్రయులు
దక్షిణ కొరియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత మూడు రోజులుగా కుంభవృష్టి కారణంగా మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో కొండచరియలు సైతం విరిగిపడుతున్నాయి. ఫలితంగా 26మంది మృత్యువాత పడ్డారు. మరో 14మంది గల్లంతు కాగా, 13మంది గాయాలపాలయ్యారని ఆ దేశ అంతర్గత, భద్రతా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వేలాది జనం తమ ఇళ్లను విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. ఈ మేరకు 5వేల 570 మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేశారని సదరు మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా 25వేల 470 గృహాలకు విద్యుత్ సరఫరా లేకుండా పోయిందని పేర్కొంది. జులై 9 నుంచి దక్షిణ కొరియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దేశవ్యాప్తంగా రైల్వే సేవలు బంద్
4,200 మందికిపైగా ప్రజలు తాత్కాలిక నివాసాల్లో ఆశ్రయం పొందున్నట్లు ఆ దేశ అంతర్గత భద్రతా మంత్రిత్వశాఖ వివరించింది. అదే సమయంలో 20 విమానాల మేర రద్దు అయ్యాయి. దేశవ్యాప్తంగా అన్ని రకాల రైల్వేసేవలను నిలిపివేసినట్లు మంత్రిత్వశాఖ చెప్పింది. దాదాపు 200రోడ్లు సైతం మూసుకుపోయాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న కొరియన్ ప్రెసిడెంట్ యూన్ సుక్ యోల్, విపత్తు నిర్వహణ కోసం అన్ని వనరులను సమీకరించాలని ప్రధాని హాన్ డక్ సూను కోరినట్లు అధ్యక్ష కార్యాలయం వెల్లడించింది. ఆదివారం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు ఆ దేశ వాతావరణ సంస్థ హెచ్చరించింది. గాంగ్జు నగరం, చియోంగ్‌యాంగ్ కౌంటీలో 600 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవడం గమనార్హం.