Iran: ఇరాన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు.. భారత్ పౌరులకు కేంద్రం అడ్వైజరీ
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడైనా అమెరికా దాడి చేయవచ్చన్న అంచనాలు, విద్యార్థుల నిరసనలతో పరిస్థితి మళ్లీ అస్థిరంగా మారింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయుల కోసం అక్కడి మన దేశ ఎంబసీ అత్యవసర సూచనలు జారీ చేసింది. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని భారత పౌరులకు సూచించింది. ఇరాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, జనవరి 5న భారత ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా ఈ కొత్త అడ్వైజరీని జారీ చేస్తున్నట్లు ఎంబసీ పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్‌లో ఉన్న భారతీయులు..విద్యార్థులు,యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులు—అందుబాటులో ఉన్న కమర్షియల్ విమాన సర్వీసులు లేదా ఇతర ప్రయాణ సౌకర్యాలను వినియోగించి తక్షణమే దేశాన్ని వీడాలని సూచించింది.
వివరాలు
భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
భారత పౌరులు, భారత సంతతి వ్యక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిరసనలు, ఆందోళనలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లకుండా దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, స్థానిక మీడియా ద్వారా తాజా పరిణామాలను గమనించాలని సూచించింది. ప్రతి ఒక్కరూ తమ పాస్‌పోర్ట్‌లు, గుర్తింపు కార్డులు, ప్రయాణ,ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొంది. అవసరమైతే వెంటనే రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని, ఇంకా ఎంబసీ వద్ద తమ వివరాలు నమోదు చేయించుకోని వారు వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అడ్వైజరీలో స్పష్టం చేసింది.
వివరాలు
మొదటి దశ అల్లర్లలో 7,105 మంది ప్రాణాలు కోల్పోయారు
ఇరాన్ - అమెరికా మధ్య అణు అంశాలపై జరుగుతున్న చర్చలు ఇప్పటికీ స్పష్టమైన ఫలితానికి రాలేదు. ఈ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడి చేయడాన్ని వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికల రూపంలో సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే అమెరికా పశ్చిమాసియా ప్రాంతంలో విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలను మోహరించినట్లు సమాచారం. ఈ పరిణామాల మధ్య టెహ్రాన్'లో మళ్లీ నిరసనలు భగ్గుమన్నాయి. పలు విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. దీంతో దేశంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. మొదటి దశ అల్లర్లలో సుమారు 7,105 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాకు చెందిన ఒక మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.