Donald Trump: ఇరాన్ యుద్ధం నుంచి ఇక బయటపడుదాం.. ట్రంప్ టాప్ జనరల్ కీలక సలహా
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో ఐదు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా ఆయుధ నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘర్షణలకు వీలైనంత త్వరగా ముగింపు పలకాలని అమెరికాలోనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యవర్గానికి కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం నుంచి ఇకనైనా బయటపడాలని, లేదంటే ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని డాన్ కేన్ హెచ్చరించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా కథనం వెల్లడించింది.
వివరాలు
వైమానిక దాడులతో లక్ష్యాలు సాధించలేం
ఇరాన్‌తో యుద్ధం స్వల్పకాలికంగానే ఉండాల్సిందని, అయితే ఇప్పటికే ఆ దశను దాటిపోయిందని డాన్ కేన్ ట్రంప్ సలహాదారులకు ప్రైవేటుగా చెప్పినట్లు సమాచారం.
పశ్చిమాసియాలో ఘర్షణలను మరింత తీవ్రతరం చేసేందుకు అమెరికా వద్ద ఉన్న సైనిక మార్గాలను ఉపయోగిస్తే అవి ప్రతికూల ఫలితాలకు దారితీసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది.
కేవలం వైమానిక శక్తితోనే నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం.
అందువల్ల ఇకనైనా యుద్ధం నుంచి బయటపడేందుకు మార్గాలను అన్వేషించాలని డాన్ కేన్ సూచించినట్లు కథనాలు పేర్కొంటున్నాయి.
ఇదే అంశంపై ఆయన పలువురు క్యాబినెట్ అధికారులతో పాటు సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్‌క్లిఫ్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తోనూ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
వివరాలు
భూతల దాడులకు ట్రంప్ విముఖత
ఇరాన్‌లో భూతల దాడులు చేపట్టేందుకు అధ్యక్షుడు ట్రంప్ విముఖత చూపుతున్నారు. అందుకు బదులుగా వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేస్తామని ఆయన ఇటీవల పలుమార్లు ప్రకటిస్తున్నారు.
ఇలాంటి హెచ్చరికల ద్వారా ఇరాన్‌ను చర్చలకు, ఒప్పందానికి తీసుకురావచ్చని ట్రంప్ విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే సుదీర్ఘకాలంగా వైమానిక దాడులు కొనసాగుతుండటంతో అమెరికా ఆయుధ నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఇటీవల వెలువడిన కొన్ని కథనాల ప్రకారం.. అమెరికా వద్ద ఉన్న మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్‌సెప్టర్లలో దాదాపు 80 శాతం, అలాగే పేట్రియాట్ క్షిపణుల్లో దాదాపు సగం ఇప్పటికే వినియోగమైపోయినట్లు సమాచారం.
వివరాలు
భారీగా ఆయుధ నిల్వలు ఉన్నాయి
అయితే అమెరికా ఆయుధ నిల్వలు తగ్గిపోతున్నాయన్న వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. తమ వద్ద భారీ స్థాయిలో ఆయుధ నిల్వలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో రక్షణ రంగ సంస్థలు ప్లాంట్లు, ఫ్యాక్టరీలను నిర్మిస్తున్నాయని తన ట్రూత్ సోషల్ ఖాతాలో ట్రంప్ వెల్లడించారు.
అయితే ప్రస్తుతం అమెరికా వద్ద ఎన్ని క్షిపణులు, ఆయుధాలు మిగిలి ఉన్నాయన్న విషయంలో మాత్రం ట్రంప్ ఎలాంటి కచ్చితమైన లెక్కలను వెల్లడించకపోవడం గమనార్హం.