 
                                                                                Sheikh Hasina: 'జీవితం ప్రమాదంలో ఉంది': బంగ్లాదేశ్ ను ఎందుకు వీడాల్సి వచ్చిందో వెల్లడించిన షేక్ హసీనా
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తన ప్రవాసంపై తొలిసారిగా మౌనం వీడారు. తన ప్రాణాలకూ, తనతో ఉన్న వారి భద్రతకూ తీవ్రమైన ప్రమాదం ఏర్పడినందునే దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. అది పూర్తిగా ఒక తప్పనిసరి నిర్ణయం అని ఆమె స్పష్టం చేశారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసిన విద్యార్థి ఉద్యమాలను ఆమె "హింసాత్మక తిరుగుబాటు"గా అభివర్ణించారు. అలాగే భద్రతా బలగాలు కాల్పులు జరపాలని తానే ఆదేశించానని వస్తున్న ఆరోపణలను ఆమె తీవ్రంగా ఖండించారు.
వివరాలు
ప్రాణభయం వల్ల దేశం విడిచాను
బ్రిటన్‌కు చెందిన 'ది ఇండిపెండెంట్' పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో హసీనా పలు కీలక అంశాలను వెల్లడించారు. "నేను అక్కడే ఉన్నానంటే నా ప్రాణాలకే కాదు, నా చుట్టూ ఉన్నవారి ప్రాణాలకు కూడా ముప్పు తథ్యం" అని ఆమె వివరించారు. గత ఏడాది ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు చేరిన విషయం తెలిసిందే. తన పార్టీ అవామీ లీగ్పై బంగ్లాదేశ్‌లో నిషేధం కొనసాగుతున్నప్పటికీ, దేశంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించడం తానే లక్ష్యంగా పెట్టుకున్నానని హసీనా మరోసారి తెలిపారు.
వివరాలు
"అది ఒక హింసాత్మక తిరుగుబాటు"
స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగ కోటాను రద్దు చేయాలనే డిమాండ్‌తో ప్రారంభమైన విద్యార్థుల నిరసనలు క్రమంగా విస్తరించి, చివరికి తన ప్రభుత్వాన్ని కూల్చివేసే స్థాయికి చేరాయని హసీనా తెలిపారు. ఈ ఉద్యమాలను ఆమె "హింసాత్మక తిరుగుబాటు"గా వర్ణిస్తూ.. "దేశ నాయకురాలిగా బాధ్యత నాది. కానీ భద్రతా బలగాలను కాల్పులు జరపమని నేనే ఆదేశించాననడం పూర్తిగా అబద్ధం" అని స్పష్టం చేశారు. ఆ ఘర్షణల్లో ప్రాణనష్టానికి కారణం భద్రతా దళాల క్రమశిక్షణ లోపం మాత్రమేనని ఆమె పేర్కొన్నారు. మృతుల సంఖ్యను 1,400గా ప్రచారం చేయడం కేవలం తనపై జరుగుతున్న దుష్ప్రచారంలో భాగమని, వాస్తవానికి ఆ సంఖ్యను కావాలనే పెంచి చెబుతున్నారని హసీనా అన్నారు.
వివరాలు
నాపై బూటకపు విచారణ
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ (ICT) తనపై జరుపుతున్న విచారణను హసీనా "బూటకపు విచారణ"గా పేర్కొన్నారు. "నన్ను రాజకీయంగా మట్టుపెట్టడానికే, ఎన్నిక కాని ప్రభుత్వం నా ప్రత్యర్థులతో కలిసి ఈ కోర్టును నడుపుతోంది" అని ఆమె ఆరోపించారు. తనపై మరణశిక్ష విధించినా తాను భయపడబోనని, ఆశ్చర్యపోనని ఆమె ధీమాగా తెలిపారు. ఇక మరోవైపు, బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన ప్రాసిక్యూటర్ తాజుల్ ఇస్లాం, విద్యార్థి నిరసనల సమయంలో జరిగిన హింసకు, మానవ హక్కుల ఉల్లంఘనలకు షేక్ హసీనానే ప్రధాన సూత్రధారి అని ఆరోపిస్తున్నారు. ఇంటర్వ్యూలో హసీనా తన రాజకీయ పునరాగమనం గురించి లేదా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చే ప్రణాళికలు గురించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.