Burj Khalifa: బుర్జ్ ఖలీఫాను తాకిన పిడుగు.. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన దుబాయ్ యువరాజు
ఈ వార్తాకథనం ఏంటి
దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది. ఈవీడియోను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయడంతో దీనికి మరింత ప్రాధాన్యం దక్కింది. భారీ వర్షం కురుస్తుండగా, ఉరుముల గర్జనల మధ్య ఆకాశం నుంచి వచ్చిన పిడుగు నేరుగా బుర్జ్ ఖలీఫా పైభాగాన్ని తాకిన దృశ్యం ఈవీడియోలో కనిపిస్తోంది. ఫోటోగ్రఫీతో పాటు ప్రకృతి అందాలపై ప్రత్యేక ఆసక్తి ఉన్న షేక్ హమ్దాన్ ఈ పోస్ట్‌కు కేవలం 'దుబాయ్'అనే చిన్న క్యాప్షన్ మాత్రమే జోడించారు. ఆయనను అభిమానులు ప్రేమగా 'ఫజ్జా' అనే పేరుతో కూడా పిలుస్తుంటారు.
Details
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు
ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వాతావరణం అస్థిరంగా కొనసాగుతోంది. 'అల్ బషాయర్' అల్పపీడనం ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిస్థితుల మధ్యే బుర్జ్ ఖలీఫాపై పిడుగు పడిన ఘటన చోటుచేసుకుంది. 829.8 మీటర్ల ఎత్తుతో బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. తరచూ పిడుగులు పడే అవకాశాలు ఉన్నా, భవనానికి ఎలాంటి నష్టం కలగకుండా ప్రత్యేకమైన ఆధునిక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల ఇది సురక్షితంగా ఉందని నిపుణులు చెబుతున్నారు.