Loading...
Trump: కెనడా వల్ల అమెరికాకు భారీ నష్టం.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు
కెనడా వల్ల అమెరికాకు భారీ నష్టం.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Trump: కెనడా వల్ల అమెరికాకు భారీ నష్టం.. ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 31, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వ్యాఖ్యలకు కెనడా ప్రధాని మార్క్ కార్నీతో పాటు ఆ దేశానికి చెందిన ఇతర నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు రోజురోజుకూ దిగజారుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి కెనడాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కెనడా నుంచి అమెరికాకు ఏమీ అవసరం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాల నుంచి తప్పించుకోవాలంటే కెనడాకు చెందిన కంపెనీలన్నీ తమ కార్యకలాపాలను అమెరికాకు తరలించాలని సూచించారు. కెనడా దశాబ్దాలుగా అమెరికాను దారుణంగా దోపిడీ చేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ట్రంప్‌ తన 'ట్రూత్‌' సోషల్‌ మీడియా ఖాతాలో వరుస పోస్టులు చేశారు.

వివరాలు 

ఫోర్డ్‌ ఫ్యాక్టరీ ఉదాహరణగా..

2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే డెట్రాయిట్‌లోని కీలకమైన ఓ ఫ్యాక్టరీని మూసివేయాలని ఫోర్డ్‌ సంస్థ నిర్ణయించిందని ట్రంప్‌ పేర్కొన్నారు.

అయితే ఎన్నికల్లో తాను ఆధిక్యంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చూడటానికి ఆ సంస్థ వేచి చూసిందన్నారు.

ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ నిరంతరాయంగా పనిచేస్తూ భారీ లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు.

జనరల్‌ మోటార్స్‌తో పాటు ఇతర సంస్థలకు సంబంధించి కూడా ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని ట్రంప్‌ అన్నారు.

అమెరికా విధించిన సుంకాల కారణంగానే కంపెనీల కార్యకలాపాల్లో ఈ మార్పులు చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు.

వివరాలు 

'కెనడియన్‌ కార్లు, పరికరాలు వద్దు'

కెనడా నుంచి వచ్చే కార్లు, పరికరాలు సహా తమకు ఎలాంటి వస్తువులూ అవసరం లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

కెనడాతో అమెరికా నిర్వహిస్తున్న వాణిజ్యంలో ఏటా 60 బిలియన్‌ డాలర్లకుపైగా నష్టం వస్తోందని తెలిపారు.

ఇది భారత కరెన్సీలో రూ.5.7 లక్షల కోట్లకుపైగా ఉంటుందని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా కెనడా వల్ల అమెరికాకు ఇదే తరహాలో నష్టం జరుగుతోందని ట్రంప్‌ ఆరోపించారు.

గతంలో అమెరికా నుంచి తరలిపోయిన వ్యాపారాలు, కంపెనీలు ఇప్పుడు సుంకాల భారాన్ని తప్పించుకునేందుకు తిరిగి అమెరికాకు వస్తున్నాయని చెప్పారు.

కెనడాపై కఠినమైన వైఖరిని అవలంబించడంలో గత అమెరికా ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.

ADVERTISEMENT

వివరాలు 

చివరి నిమిషంలో వాణిజ్య ఒప్పందం రద్దు

ఇదిలా ఉండగా.. అమెరికా-కెనడా మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందం చివరి నిమిషంలో రద్దయింది.

ఇప్పటికే కెనడాపై అమెరికా 50 శాతం వరకు సుంకాలు విధించింది. దీనికి ప్రతిగా కెనడా కూడా అమెరికా దిగుమతులపై తాజాగా ప్రతీకార సుంకాలను అమలు చేసింది.

కెనడా నుంచి దిగుమతి చేసుకునే కార్లు, ట్రక్కులు, ఆటోమోటివ్‌ విడిభాగాలు, ఉక్కుపై ట్రంప్‌ ప్రభుత్వం 50 శాతం టారిఫ్‌లను విధించింది.

దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే పరిస్థితి నెలకొంది.

ADVERTISEMENT