Iran: 'ఓడినవారు షరతులు విధించలేరు': ట్రంప్ కాల్పుల విరమణ పొడిగింపుపై ఇరాన్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి. శాంతి చర్చలకు అవకాశం కల్పించేందుకు ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా తిరస్కరించింది. ట్రంప్ నిర్ణయం అర్థరహితమని, ఓడిపోయిన పక్షం షరతులు విధించలేదని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘర్ ఘాలిబాఫ్ సీనియర్ సలహాదారు మహదీ మొహమ్మది విమర్శించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలకు మరింత సమయం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. తన 'ట్రూత్ సోషల్' వేదిక ద్వారా స్పందిస్తూ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అభ్యర్థన మేరకు కాల్పుల విరమణను పొడిగించినట్లు వెల్లడించారు.
వివరాలు
ట్రంప్ ప్రకటనపై ఘాటుగా స్పందించిన మొహమ్మదీ
ఇరాన్ నాయకత్వంలో తీవ్ర భేదాభిప్రాయాలు ఉన్నాయని, ఒక సమగ్ర ప్రతిపాదనతో ముందుకు రావడానికి వారికి సమయం ఇస్తున్నామని చెప్పారు. అదే సమయంలో, హర్మూజ్ జలసంధిలోని ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటనపై మహదీ మొహమ్మదీ ఘాటుగా స్పందించారు. కాల్పుల విరమణ పొడిగింపుకు ఎలాంటి అర్థం లేదని, ఓడిపోయిన పక్షం షరతులు విధించలేదని ఆయన వ్యాఖ్యానించారు. దిగ్బంధనాన్ని కొనసాగించడం బాంబు దాడులతో సమానమని పేర్కొంటూ, దీనికి సైనిక చర్యతోనే ప్రతిస్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆకస్మిక దాడులకు అవకాశం కల్పించేందుకు సమయం సంపాదించే కుట్రలో భాగమే ఈ కాల్పుల విరమణ అని ఆరోపించారు. ఇకపై ఇరాన్ చొరవ తీసుకునే సమయం వచ్చిందని స్పష్టం చేశారు.
వివరాలు
ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
ఇక మరోవైపు, ఇరాన్ ఆర్థిక పరిస్థితిపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని ఇరాన్ కోరుకుంటోందని, నగదు కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టం జరుగుతోందని, సైన్యం, పోలీసులకు జీతాలు అందడం లేదన్న ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరగాల్సిన రెండో విడత శాంతి చర్చల భవితవ్యం అనిశ్చితిలో పడింది. ఇరాన్ నుంచి స్పష్టమైన ప్రతిపాదన వచ్చే వరకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌కు వెళ్లరని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఇరు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలినట్లైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మొహమ్మదీ చేసిన ట్వీట్
تمدید آتش بس از جانب ترامپ هیچ معنایی ندارد. طرف بازنده نمی تواند شرایط تعیین کند. تداوم محاصره تفاوتی با بمباران ندارد و باید به آن پاسخ نظامی داد. ضمن اینکه تمدید آتش بس از جانب ترامپ قطعا به معنای خرید زمان به منظور ضربه غافلگیرانه است. زمان ابتکار عمل ایران است.
— Mahdi Mohammadi (@mmohammadii61) April 21, 2026