బ్యాంకులో తుపాకీతో రెచ్చిపోయిన ఉద్యోగి; ఐదుగురు దుర్మరణం
అమెరికా కెంటుకీలోని డౌన్‌టౌన్ లూయిస్‌విల్లేలోని ఓ బ్యాంకు ఉద్యోగి తుపాకీతో రెచ్చిపోయాడు. బ్యాంకులో జరిగిన ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మరో తొమ్మిది మంది గాయపడినట్లు వెల్లడించారు. మరణించిన వారిలో కెంటకీ గవర్నర్‌కు సన్నిహితుడైన టామీ ఇలియట్ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వాటర్‌ఫ్రంట్ పార్క్‌కు దూరంగా ఉన్న భవనంలో జరిగిన కాల్పుల్లో తన స్నేహితుడిని కోల్పోయినట్లు కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ ధృవీకరించారు. మిగిలిన వారిని జాషువా బారిక్(40), టామీ ఇలియట్(63), జూలియానా ఫార్మర్(45), జేమ్స్ టట్(64), డీనా ఎకెర్ట్(57)గా గుర్తించారు. అలాగే కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడిక్కడే చనిపోయినట్లు, అతడిని 23 ఏళ్ల కానర్ స్టర్జన్‌గా గుర్తించినట్లు అధికారులు రాయిటర్స్‌కు తెలిపారు.
తుపాకీలను నియంత్రించే చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలి: బైడెన్
షూటర్ పోలీసుల కాల్పుల వల్ల చనిపోయాడా? లేదా స్వీయ గాయంతో మరణించాడా? అనేది వారికి కచ్చితంగా తెలియలేదని లూయిస్‌విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దాదాపు ఉదయం 8.30 గంటలకు (అమెరికా కాలమానం ప్రకారం) ఘటన గురించి తమకు సమాచారం అందిందని, నిమిషాల వ్యవధిలోనే కాల్‌కు స్పందించామని పోలీసులు రాయిటర్స్‌కు తెలిపారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. తుపాకీలను నియంత్రించే చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలని తన కోరికను మరోసారి పునరుద్ఘాటించారు. కమ్యూనిటీలను రక్షించడానికి కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లు చర్య తీసుకునే ముందు ఇంకా ఎంత మంది అమెరికన్లు చనిపోవాలని బైడెన్ ప్రశ్నించారు.