Donald Trump: ట్రంప్‌కు నోబెల్ అందజేసిన మచాడో
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)తో వెనెజువెలా విపక్ష నేత, కొరీనా మచాడో (Maria Corina Machado) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె తనకు లభించిన నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్‌కు అందజేశారు. వెనెజువెలా ప్రజల సంక్షేమం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలకు గుర్తింపుగా ఈ బహుమతిని ఇస్తున్నట్లు మచాడో వెల్లడించారు. తమ దేశ భవిష్యత్తు, ప్రజల స్వేచ్ఛ అంశాలపై ట్రంప్‌తో విస్తృతంగా చర్చించినట్లు ఆమె తెలిపారు. వెనెజువెలా ప్రజలు స్వేచ్ఛ కోసం అమెరికా అధ్యక్షుడిపై ఆధారపడవచ్చని ఆమె వ్యాఖ్యానించారు. అలాగే కరేబియన్ ప్రాంతంలో చమురు ట్యాంకర్లను అమెరికా దళాలు స్వాధీనం చేసుకుంటున్న అంశాన్ని కూడా ట్రంప్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
Details
మచాడో అద్భుత మహిళ: ట్రంప్
మచాడోతో సమావేశంపై అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఆమె అందజేసిన నోబెల్ పురస్కారాన్ని తాను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 'మచాడోతో భేటీ కావడం ఎంతో ఆనందంగా ఉంది. అనేక కష్టాలను ఎదుర్కొన్న అద్భుత మహిళ ఆమె. నేను చేస్తున్న కృషికి గౌరవ సూచకంగా ఆమె తన నోబెల్ బహుమతిని నాకు ఇచ్చారు. ఇది పరస్పర గౌరవానికి నిదర్శనం. థాంక్యూ మరియా'' అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
Details
నోబెల్‌ను ఇలా ఇవ్వొచ్చా..?
మచాడో తనకు లభించిన నోబెల్ శాంతి పురస్కారాన్ని అధ్యక్షుడు ట్రంప్‌కు ఇస్తానని ప్రకటించడంపై నోబెల్ ఇన్‌స్టిట్యూట్ తాజాగా స్పందించింది. ఒకసారి నోబెల్ పురస్కారం ప్రకటించిన తర్వాత దానిని రద్దు చేయడం, బదిలీ చేయడం లేదా ఇతరులతో పంచుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. నోబెల్ కమిటీ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని, అందులో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండదని, ఇదే నిబంధన ఎప్పటికీ వర్తిస్తుందని తెలిపింది. అయినప్పటికీ మచాడో తన నోబెల్ బహుమతిని ట్రంప్‌కు అందజేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఆ మెడల్‌ను ట్రంప్ తన వద్దే ఉంచుకోవాలని భావిస్తున్నట్లు వైట్‌హౌస్ అధికారి వెల్లడించినట్టు ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి.