Loading...
Indian Students in USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు నిబంధనలను కొట్టేసిన కోర్టు!
అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు నిబంధనలను కొట్టేసిన కోర్టు!

Indian Students in USA: అమెరికాలో భారతీయ విద్యార్థులకు భారీ ఊరట.. ట్రంప్ సర్కారు నిబంధనలను కొట్టేసిన కోర్టు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయులతో పాటు ఇతర దేశాల విద్యార్థులకు ఊరట లభించింది. విదేశీ విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులు అమెరికాలో ఉండే కాలపరిమితిపై ఆంక్షలు విధిస్తూ ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన నిబంధనలను బోస్టన్ ఫెడరల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జులైలో ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదిత విధానం నిరంకుశంగా, వివేకరహితంగా, చట్టవిరుద్ధంగా ఉందని ఫెడరల్ జడ్జి ఎఫ్. డెన్నిస్ సేలర్ సోమవారం వెలువరించిన తీర్పులో వ్యాఖ్యానించారు. ఈ తీర్పు ఎఫ్‌-1 వీసాపై చదువుకుంటున్న విదేశీ విద్యార్థులు, జే-1 వీసాపై పరిశోధనలు చేస్తున్నవారు, ఐ వీసాపై అమెరికాలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఉపశమనం కలిగించింది.

వివరాలు

కాంగ్రెస్ ఉద్దేశానికి విరుద్ధంగా కొత్త విధానం

విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యావకాశాలు కల్పించడాన్ని కాంగ్రెస్ ప్రోత్సహిస్తోందని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు.

ఇక్కడ చదువుకునేందుకు అనుమతిస్తూనే.. వారు దేశంలో ఉండే కాలవ్యవధిపై పరిమితులు విధించాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) ప్రతిపాదించిన కొత్త విధానం కాంగ్రెస్ ఉద్దేశానికి విరుద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

ఎఫ్‌-1 వీసా కార్యక్రమాన్ని బలహీనపరిచే అధికారం డీహెచ్‌ఎస్‌కు లేదని వ్యాఖ్యానించారు.

ఈ తీర్పును 'ది ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్' (FIIDS) స్వాగతించింది.

వివరాలు

ట్రంప్ సర్కారు ప్రతిపాదించిన మార్పులివే..

ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం ఎఫ్‌-1, జే-1 వీసాదారులు తమ కోర్సు లేదా పరిశోధన పూర్తయిన తర్వాత కూడా నిబంధనలకు అనుగుణంగా అమెరికాలో ఉండేందుకు అవకాశం ఉంది.

అయితే డీహెచ్‌ఎస్ ప్రతిపాదించిన కొత్త విధానంలో ఈ వెసులుబాటుకు పరిమితులు విధించారు.

ఎఫ్‌-1, జే-1 వీసాలు

ఈ వీసాదారులు అమెరికాలో ఉండే కాలవ్యవధిని నాలుగేళ్లకు పరిమితం చేయాలని ప్రతిపాదించారు.

ఆ తర్వాత కూడా అక్కడే ఉండాలంటే మళ్లీ ఇమిగ్రేషన్‌కు దరఖాస్తు చేసుకుని ఫెడరల్ అనుమతి పొందాల్సి ఉంటుంది.

గ్రేస్ పీరియడ్

చదువు లేదా ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రెయినింగ్ (OPT) పూర్తయిన తర్వాత అమెరికాను విడిచి వెళ్లేందుకు ఇచ్చే గడువును 60 రోజుల నుంచి 30 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు.

ADVERTISEMENT

వివరాలు

ఐ వీసా

ప్రస్తుతం ఐదేళ్ల వరకు అమెరికాలో ఉండేందుకు అనుమతించే నిబంధనను 240 రోజులకు కుదించాలని ప్రతిపాదించారు.

చైనా జర్నలిస్టులు

చైనాకు చెందిన పాత్రికేయుల అమెరికా బస కాలవ్యవధిని 90 రోజులకు పరిమితం చేయాలని కొత్త విధానంలో పేర్కొన్నారు.

ADVERTISEMENT

వివరాలు

ఇప్పటికే ప్రాథమిక ఉత్తర్వులు జారీ

ఈ నూతన విధానంపై బోస్టన్ ఫెడరల్ జడ్జి సెప్టెంబరులోనే ప్రాథమిక ఇంజంక్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

అయితే ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఫస్ట్ సర్క్యూట్ కోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.

తాజాగా బోస్టన్ ఫెడరల్ కోర్టు వెలువరించిన తీర్పుతో ఈ వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.

దీనిపై అప్పీళ్ల కోర్టు త్వరలోనే తుది తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి.

దీంతో అమెరికాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో పాటు ఇతర దేశాల విద్యార్థులు, పరిశోధకులు, పాత్రికేయులు తదుపరి పరిణామాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ADVERTISEMENT