LOADING...
Chinese Spy: యూకే ప్రధాని కారులో చైనా గూఢచర్యం.. నాలుగేళ్లుగా సీక్రెట్ ట్రాకింగ్ డివైజ్!
యూకే ప్రధాని కారులో చైనా గూఢచర్యం.. నాలుగేళ్లుగా సీక్రెట్ ట్రాకింగ్ డివైజ్!

Chinese Spy: యూకే ప్రధాని కారులో చైనా గూఢచర్యం.. నాలుగేళ్లుగా సీక్రెట్ ట్రాకింగ్ డివైజ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

యునైటెడ్ కింగ్డమ్‌లో భారీ భద్రతా వైఫల్యం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ వినియోగించే అధికారిక ప్రభుత్వ వాహనంలో చైనాకు చెందిన సీక్రెట్ ట్రాకింగ్ పరికరాన్ని బ్రిటిష్ నిఘా అధికారులు గుర్తించినట్లు టెలిగ్రాఫ్ నివేదిక వెల్లడించింది. వాహనం ఉన్న ప్రదేశానికి సంబంధించిన సమాచారాన్ని పంపగల ఈ పరికరం, చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఒక సీల్డ్ విడిభాగంలో అమర్చినట్లు దర్యాప్తులో తేలింది. దాదాపు నాలుగేళ్ల పాటు ఈ డివైజ్ పనిచేసినట్లు సమాచారం.

వివరాలు 

ఈ అంశాన్ని ధృవీకరించిన బ్రిటన్ మాజీమంత్రి

విదేశీగూఢచర్య కార్యకలాపాలపై అప్రమత్తమైన బ్రిటన్ నిఘా, భద్రతా సంస్థలు ప్రభుత్వ, దౌత్య అధికారుల వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది. టెలిగ్రాఫ్ పేర్కొన్న నిఘా వర్గాల సమాచారం ప్రకారం..వాహన తయారీ సంస్థకు విడిభాగాన్ని పంపే ముందే చైనాకు చెందిన ఓ సబ్-సప్లయర్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్(ECU)లో ఈ ట్రాకింగ్ పరికరాన్ని అమర్చినట్లు గుర్తించారు. యూనిట్ పూర్తిగా సీల్ చేసి ఉండటంతో వాహన తయారీదారుకు కూడా ఇది తెలియకుండా వాహనంలో అమర్చినట్లు చెబుతున్నారు. బ్రిటన్ మాజీమంత్రి డంకన్ స్మిత్ కూడా ఈ అంశాన్ని ధ్రువీకరించారు. ప్రధానమంత్రి అధికారిక వాహనాలైన రేంజ్ రోవర్ సెంటినెల్స్‌లో ఈ పరికరాలను గుర్తించడానికి భద్రతా సిబ్బంది వాహనంలోని భాగాలను పూర్తిగా విడదీయాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

వివరాలు 

చైనాపై మరింత కఠిన వైఖరి అవలంబించాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి

ఈ వ్యవహారం కేవలం ప్రధాని వాహనానికే పరిమితం కాదని నిఘా అధికారులు భావిస్తున్నారు. పాశ్చాత్య దేశాల సరఫరా వ్యవస్థలను ప్రభావితం చేయడానికి చైనా అనుసరిస్తున్న విస్తృతమైన, ఆటోమేటెడ్ వ్యూహంలో ఇది భాగమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. విడిభాగాలు భారీ స్థాయిలో తయారవుతున్నందున సాధారణ ప్రజల వాహనాల నుంచి దేశాధినేతల అధికారిక కార్ల వరకు ఏ వాహనమైనా ట్రాకింగ్ సాధనంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో చైనాపై మరింత కఠిన వైఖరి అవలంబించాలని బ్రిటన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. చైనాను కేవలం వ్యవస్థాగత సవాల్‌గా కాకుండా, ప్రత్యక్ష భద్రతా ముప్పుగా పరిగణించాలని పలువురు ప్రముఖ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

వివరాలు 

2023లో చైనా గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలు

అయితే ఈ ఆరోపణలను చైనా పూర్తిగా ఖండించింది. లండన్‌లోని చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి స్పందిస్తూ.. ఇవన్నీ నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారమని పేర్కొన్నారు. చైనా టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుని పశ్చిమ దేశాల రాజకీయ నాయకులు జాతీయ భద్రత అంశాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చైనా ఆరోపణలను తిరస్కరించినప్పటికీ, నాలుగేళ్ల పాటు కొనసాగిన ఈ భద్రతా లోపం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం కీలక జాతీయ మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ వ్యవస్థల్లో ఉపయోగిస్తున్న సాంకేతిక పరికరాలు, విడిభాగాలపై సమగ్ర సమీక్ష చేపట్టింది. కాగా, 2023లో కూడా బ్రిటన్ మంత్రులు, ప్రభుత్వ వ్యవస్థలపై చైనా గూఢచర్యానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement