Loading...
US Storm: అమెరికాలో భారీ తుపాను బీభత్సం.. 9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా
అమెరికాలో భారీ తుపాను బీభత్సం.. 9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా

US Storm: అమెరికాలో భారీ తుపాను బీభత్సం.. 9 లక్షల ఇళ్లకు నిలిచిన విద్యుత్ సరఫరా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2026
09:13 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో థాంక్స్‌గివింగ్ పండుగ వేళ భారీ తుపాను ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసింది. దేశ తూర్పు తీర ప్రాంతాల్లో విరుచుకుపడిన ఈ తుపాను ప్రభావంతో కుండపోత వర్షాలు, తీవ్ర ఈదురుగాలులు, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు వరద నీటితో నిండిపోయాయి. బలమైన గాలులకు చెట్లు కూలి ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, తీగలపై పడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గురువారం సాయంత్రం నాటికి దాదాపు 9 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు కరెంట్ లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు విమాన రాకపోకలపైనా తుపాను ప్రభావం స్పష్టంగా కనిపించింది.

వివరాలు 

440కి పైగా విమానాలు రద్దు.. వేలాది సర్వీసులకు ఆలస్యం

తుపాను కారణంగా అమెరికాలో విమాన ప్రయాణాలు గందరగోళంగా మారాయి.

గురువారం నాటికి 440కి పైగా విమాన సర్వీసులను రద్దు చేయగా, మరో 2,200కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి.

ముఖ్యంగా న్యూయార్క్, వాషింగ్టన్ నగరాల పరిధిలోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

గంటకు 110 కిలోమీటర్లకు మించిన వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో విమానాల రాకపోకలను సాధారణంగా కొనసాగించడం కష్టంగా మారింది.

థాంక్స్‌గివింగ్ సెలవుల సందర్భంగా కుటుంబ సభ్యులను కలిసేందుకు సొంత ప్రాంతాలకు వెళ్లాలని, పర్యటనలు చేయాలని ముందుగా ప్రణాళికలు వేసుకున్నవారికి ఈ పరిస్థితి ఇబ్బందులు తెచ్చిపెట్టింది.

వివరాలు 

వందో ఏడాది మేసీ పరేడ్ వాయిదా

న్యూయార్క్‌లో ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రసిద్ధ మేసీ థాంక్స్‌గివింగ్ డే పరేడ్‌పైనా తుపాను ప్రభావం పడింది.

ఈ ఏడాది ఈ వేడుక వందోసారి జరగాల్సి ఉంది.అయితే భారీ వర్షాలు,బలమైన గాలుల హెచ్చరికల నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు,నగర అధికారులు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు.

దీంతో నవంబర్ 28,శనివారానికి పరేడ్‌ను మార్చారు.ఈ వేడుకలో భారీ ఆకారాల్లో ఉండే గాలిబుడగలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

అయితే గాలుల వేగం ఎక్కువగా ఉన్నప్పుడు వాటిని నియంత్రించడం కష్టమవుతుంది.

అవి అదుపు తప్పితే అక్కడికి వచ్చే ప్రేక్షకులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.ఈ కారణంగానే పరేడ్‌ను వాయిదా వేశారు.

వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడటం పరేడ్ చరిత్రలో ఇదే తొలిసారి.

ADVERTISEMENT

వివరాలు 

పలు రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం.. నీటి వినియోగం తగ్గించాలని సూచన

అయితే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో 1942 నుంచి 1944 వరకు యుద్ధ అవసరాల దృష్ట్యా ఈ వేడుకను నిర్వహించలేదు.

పెన్సిల్వేనియా, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వర్జీనియా రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరాకు ఎక్కువగా అంతరాయం ఏర్పడింది.

ఇప్పటికే భారీ వర్షాలతో నేల తడిసిపోవడంతో బలమైన గాలులకు చెట్లు కూలిపోయాయి.

దీంతో విద్యుత్ తీగలు తెగిపడి పలు ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోయింది.

మరికొన్ని చోట్ల వరద నీరు రహదారులపైకి చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

మేరీల్యాండ్‌లోని మాంట్‌గోమరీ,ప్రిన్స్ జార్జ్ కౌంటీల్లో విద్యుత్ సమస్యల కారణంగా నీటి సరఫరా వ్యవస్థపైనా ప్రభావం పడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో దాదాపు 20 లక్షల మంది ప్రజలు కుళాయి నీటి వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి ప్రకటన

మరోవైపు బలమైన గాలుల కారణంగా భద్రతా చర్యల్లో భాగంగా కొన్ని ప్రధాన వంతెనలపై రాకపోకలను కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

తుపాను తీవ్రతను ముందుగానే గుర్తించిన న్యూజెర్సీ గవర్నర్ మికీ షెరిల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

తుపాను ప్రభావంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నందున ప్రజలు తమ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను ముందుగానే పూర్తిగా ఛార్జ్ చేసుకోవాలని సూచించారు.

రోడ్లపై తెగిపడిన విద్యుత్ తీగలు కనిపిస్తే వాటి సమీపానికి వెళ్లకూడదని హెచ్చరించారు.

వరద నీటితో నిండిన రహదారులపై ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలకు స్పష్టం చేశారు.

వివరాలు 

న్యూజెర్సీలో అత్యవసర పరిస్థితి ప్రకటన

ఇదిలా ఉండగా, అమెరికాలోని కాలిఫోర్నియాలోనూ ఈ వారం వాతావరణం ప్రతికూలంగా మారింది.

భారీ వర్షాలు, సముద్రంలో ఎగసిపడుతున్న ఎత్తైన అలల కారణంగా కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ముందుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలోనూ వర్షాలు కురిశాయి. ఇలా థాంక్స్‌గివింగ్ సెలవుల సమయంలో అమెరికాలోని తూర్పు తీరంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది.

విద్యుత్ అంతరాయాలు, విమాన సర్వీసుల రద్దు, రవాణా సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ADVERTISEMENT