India- Maldives: భారత టూరిస్టులకు మాల్దీవుల అధ్యక్షుడు ప్రత్యేక విజ్ఞప్తి
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు నాలుగు రోజుల పర్యటన కోసం భారత్‌కు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత టూరిస్టులు మాల్దీవులకు రావాలని ఆహ్వానిస్తూ, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపిస్తున్నారని పేర్కొన్నారు. ముయిజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఆయన తీసుకున్న నిర్ణయాలు, మంత్రుల చేసిన వ్యాఖ్యలతో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాల్లో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ముయిజ్జు నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉంది: ముయిజ్జు
''భారత భద్రతను బలహీనపరిచేలా మాల్దీవులు వ్యవహరించదు. న్యూదిల్లీ మాకు విలువైన భాగస్వామి. రక్షణ సహా ఇతర రంగాల్లో ప్రాధాన్యం ఉంటుంది. మేం వివిధ రంగాల్లో ఇతర దేశాలతో సహకారాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు.. మా చర్యలు మా ప్రాంత భద్రత, స్థిరత్వంపై రాజీ లేకుండా ఉండేలా చూసుకుంటాం. మా పొరుగువారు, స్నేహితులపై గౌరవంతో వ్యవహరించడం మా డీఎన్‌ఏలో ఉంది'' అని వెల్లడించారు. అలాగే, ''మాల్దీవ్స్ ఫస్ట్'' విధానం గురించి మాట్లాడుతూ, ''అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరం. అలాగే ఏ ఒక్క దేశం పైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సి ఉంది'' అని అన్నారు.
భారత్‌లో అక్టోబర్ 10 వరకు ముయిజ్జు
ఈసందర్భంగానే భారత టూరిస్టులకు ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలోనే మోదీ ఈ ఏడాది జనవరిలో లక్షద్వీప్‌లో పర్యటించగా, అక్కడ సముద్రంలో స్నార్కెలింగ్ చేసి, ఫొటోలు షేర్ చేశారు. నెటిజన్లు ఈ పర్యటన స్థానిక పర్యటక రంగానికి ప్రోత్సాహమని అభిప్రాయపడ్డారు. అయితే, మాల్దీవుల మంత్రులు ఆ సమయంలో విమర్శలు చేయడంతో, సోషల్ మీడియాలో ''బాయ్‌కాట్ మాల్దీవ్స్'' హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం, ముయిజ్జు అక్టోబర్ 10 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. ఇరుదేశాల మధ్య ఇటీవల తలెత్తిన వివాదాల అనంతరం ముయిజ్జు భారత్‌లో పర్యటించడం ఇది రెండోసారి. మోదీ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కావడంతో మాల్దీవుల వైఖరిలో మార్పు కనిపించిందని సంకేతాలు వచ్చాయి.