India-Maldives: త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్న మాల్దీవుల ప్రెసిడెంట్ ముయిజ్జూ
మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయుజ్జు త్వరలో అధికారికంగా భారత్‌లో పర్యటించనున్నట్లు మాల్దీవుల అధ్యక్ష భవనం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయన గత సంవత్సరం నవంబరులో మాల్దీవులు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇది భారత్‌లో పర్యటించడం రెండవ సారి. మొదటిసారి ఆయన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన అధికారిక పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారని మాల్దీవుల అధ్యక్ష భవనం ప్రకటించింది, అయితే పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలు ఇంకా తెలియజేయలేదు.
మయుజ్జు అధ్యక్షుడిగా మొదటి విదేశీ పర్యటన తుర్కియే,చైనాలో..
చైనా అనుకూలంగా పేరున్న మయుజ్జు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, మునుపటి అధ్యక్షుల్లా కాకుండా తన మొదటి విదేశీ పర్యటనను తుర్కియే,చైనాలో నిర్వహించారు. ఈ క్రమంలో భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు కూడా బలహీనపడ్డాయి.మాల్దీవుల నుండి భారత బలగాలు వెళ్ళిపోవాలని మయుజ్జు పెట్టిన షరతు ఈ పరిణామాలకు దారితీసింది. అలాగే,భారత ప్రధానమంత్రి మోదీ ఈ ఏడాది లక్షద్వీప్‌లో పర్యటించిన సమయంలో మాల్దీవుల మంత్రులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. ఈ వ్యాఖ్యల కారణంగా సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై,'బాయ్‌కాట్ మాల్దీవ్స్'హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. అయితే,ఈ వ్యాఖ్యలకు తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది.ఆ వ్యాఖ్యలు చేసిన మంత్రులపై చర్యలు తీసుకుంది.
మాల్దీవులకు భారత విదేశాంగ మంత్రి జైశంకర్
జూన్ 9న ముయుజ్జు మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. ఇటీవల భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మయుజ్జు ఇప్పుడు అధికారికంగా భారత్ పర్యటించనున్నారని ప్రకటించడం విశేషం.