UN: న్యూయార్క్ ఐరాస కార్యాలయం ఎదుట టిబెట్ జెండాతో వ్యక్తి ఆత్మహత్య..
ఈ వార్తాకథనం ఏంటి
టిబెట్‌పై చైనా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంప్రదాయ బౌద్ధ సన్యాసి వస్త్రాలు ధరించిన అతడు, "టిబెట్‌ను చైనా వీడాలి" అని రాసిన కరపత్రాలను ప్రదర్శిస్తూ టిబెట్ జాతీయ పతాకాన్ని చేతబట్టి తనకు తానే నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని లోబ్గా రాంగ్జెన్ (52)గా గుర్తించినట్లు సమాచారం. ఐరాసలో సమావేశాల కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
వివరాలు
13వ శతాబ్దం నుంచే టిబెట్ తమ భూభాగంలో భాగమన్న చైనా
టిబెట్‌పై చైనా ఆక్రమణను వ్యతిరేకిస్తూ,ఆ ప్రాంతం నుంచి చైనా వైదొలగాలని డిమాండ్ చేస్తూ 2009 నుంచి ఇప్పటివరకు దాదాపు 150 మంది ఆత్మాహుతికి పాల్పడినట్లు సమాచారం. వీరిలో బౌద్ధ సన్యాసులు,విద్యార్థులు,రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. 2009లో ఓ యువ బౌద్ధ సన్యాసి ఆత్మహత్యతో ఈ తరహా నిరసనలు ప్రారంభమయ్యాయి. టిబెట్‌కు ఆధ్యాత్మిక నాయకుడైన దలైలామాను తిరిగి టిబెట్‌కు అనుమతించాలని,అలాగే చైనా అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిరసనకారులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రవాస టిబెట్ నాయకత్వం ప్రజలను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని చైనా ఆరోపిస్తోంది. 1951లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ టిబెట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. కాగా, 13వ శతాబ్దం నుంచే టిబెట్ తమ భూభాగంలో భాగమని చైనా ఇప్పటికీ వాదిస్తోంది.