COP 28: కాప్ 28 సదస్సులో ఊహించని పరిణామం.. వేదికపై మణిపూర్ బాలిక నిరసన
దుబాయ్ వేదికగా జరుగుతున్న 'కాప్-28' (COP28) ప్రపంచ వాతావరణ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్‌కు చెందిన లిసిప్రియా కాన్‌గుజమ్ అనే 12 ఏళ్ల బాలిక అకస్మాత్తుగా చర్చా వేదికపై వచ్చి పెట్రోల్, డీజల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేసింది. శిలాజ ఇంధనాలకు ముగింపు పలికి మన భూగ్రహాన్ని, భవిష్యత్తును రక్షించాలంటూ ప్లకార్డులను ప్రదర్శించింది. అయితే కొద్దిసేపటి తర్వాత సిబ్బంది వచ్చి ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వారి మాట వినకుండా అటూ ఇటూ తిరుగుతూ నిరసనను తెలియజేసింది.
లిసిప్రయా ప్రసంగానికి చప్పట్లతో దద్దరిల్లిన వేదిక
అయితే లిసిప్రియా ప్రసంగానికి వేదిక మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది. దీనిపై లిసిప్రియా స్పందించింది. తాను నిరసన తెలియజేయడంతో 30 నిమిషాల పాటు అదుపులోకి తీసుకున్నారని, శిలాజ ఇంధనాలు వాడొద్దని చెప్పడమే తాను చేసినా నేరమా అంటూ ట్వీట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఐరాస ప్రాంగణంలోనే బాలల హక్కుల ఉల్లంఘన జరిగిందని, ఐరాస వద్ద తన గళాన్ని వినిపించే హక్కు తనకు ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆటోనియో గుటెరస్‌ను ట్యాగ్ చేసింది. ఈ ఘటనపై కాప్ 20 డైరక్టర్ జనరల్ అంబాసిడర్ మజిల్ అల్ సువైదీ స్పందించారు. ఆ చిన్నారి ఉత్సహాన్ని చూసి తాను ఆశ్చర్యపోయానని పేర్కొన్నాడు.