South Korea: మార్షల్ లా వివాదం.. మాజీ రక్షణ మంత్రి అరెస్టు
దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అనూహ్యంగా 'ఎమర్జెన్సీ మార్షల్ లా'ను ప్రకటించి, దేశంలో తీవ్ర గందరగోళ పరిస్థితిని సృష్టించారు. ఈ చర్యపై తీవ్ర విమర్శలు రావడంతో యూన్ సుక్ యోల్‌పై వ్యతిరేకత మరింత ఎక్కువైంది. ఈ పరిణామంలో మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్ పాత్ర ఉందనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చాయి. హ్యూన్‌ను పదవి నుంచి తొలగిస్తూ యూన్ సుక్ యోల్ స్వయంగా ప్రకటించారు. హ్యూన్ స్థానంలో చోయ్ బ్యూంగ్ హ్యూక్‌ను కొత్త రక్షణ మంత్రిగా నియమించారు.
ప్రజల ఆగ్రహానికి గురైన మార్షల్ లా నిర్ణయం
మార్షల్ లా అమలులో సైన్యం తన ఆదేశాల మేరకే పనిచేసిందని, తన బాధ్యతను ఒప్పుకున్న హ్యూన్, అవసరమైతే రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే పరిస్థితుల దృష్ట్యా ఆయనను విచారణ కోసం సియోల్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్స్ కార్యాలయంలో హాజరయ్యారనే సమాచారం ఉంది. ప్రతిపక్షాలు ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాయి. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రతిపక్షాలే కారణమని యూన్ ఆరోపించారు. మార్షల్ లా నిర్ణయం ప్రజల ఆగ్రహానికి గురైంది. పార్లమెంట్‌లో ప్రతిపక్షాలు అత్యవసర స్థితిని రద్దు చేయాలని తీర్మానం ఆమోదించాయి. దీంతో గంటల వ్యవధిలోనే యూన్ ఎమర్జెన్సీని వెనక్కి తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో విపక్షాలు యూన్ పదవీ నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశాయి.
పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం
అదే విధంగా ఆయనపై పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం పెట్టారు. అయితే యూన్‌కు సొంత పార్టీ నుంచి మద్దతు తక్కువగానే లభించింది. అధికార పీపుల్ పార్టీ (పీపీపీ) ఆ తీర్మానం ఓటింగ్‌ను బాయ్‌కాట్ చేయడంతో యూన్ తాత్కాలికంగా తన పదవిని కాపాడుకున్నారు. రాజకీయంగా ఒత్తిడికి గురైన యూన్, ఓ టెలివిజన్ ఛానల్ ద్వారా దేశ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పడం గమనార్హం. అయినప్పటికీ ఈ పరిణామాలు దేశ రాజకీయాల్లో ఆయన స్ధానాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.