LOADING...
Masood Azhar: 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత  మసూద్‌ అజార్‌  కొత్త కుట్రలు..  జైషే మహిళా బ్రిగేడ్‌!
జైషే మహిళా బ్రిగేడ్‌!

Masood Azhar: 'ఆపరేషన్ సిందూర్‌' తర్వాత  మసూద్‌ అజార్‌  కొత్త కుట్రలు..  జైషే మహిళా బ్రిగేడ్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2025
03:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం పహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' తర్వాత, జైషే మహ్మద్‌ (Jaish-e-Mohammed) ఉగ్రసంఘానికి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ అనూహ్య దెబ్బ నుంచి బయటపడేందుకు, మసూద్‌ అజార్‌ కొత్త విధమైన ప్రయత్నాలు ప్రారంభించారన్న సమాచారం వెలువడింది. ఇందులో ముఖ్యంగా జైషే ప్రత్యేక మహిళా బ్రిగేడ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు, భద్రతా వర్గాల ఆధారంగా వెల్లడించాయి. 'జమాత్‌ ఉల్‌ మామినాత్‌' పేరుతో ఈ కొత్త యూనిట్‌ను జైషే ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఇప్పటికే, బహవల్‌పూర్‌లోని జైషే ప్రధాన కేంద్రంలో దాని నియామక ప్రక్రియలు ప్రారంభమయ్యాయని వార్తలు పేర్కొన్నాయి. ఈ కొత్త మహిళా యూనిట్‌కు మసూద్‌ అజార్‌ సోదరి సాదియా అజార్‌ నేతృత్వం వహించనుందట.

వివరాలు 

మసూద్‌ అజార్‌ కుటుంబానికి చెందిన 10 మంది హతం 

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో బహవల్‌పూర్‌లోని ఈ జైషే ప్రధాన కేంద్రంపై భారత్‌ బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో మసూద్‌ అజార్‌ కుటుంబానికి చెందిన 10 మంది హతమయ్యారు. ఆ హతుల్లో మసూద్‌ బావ, సాదియా భర్త యూసఫ్‌ అజార్‌ కూడా ఉన్నారని జైషే కమాండర్‌ ఇటీవల ధృవీకరించారు.

వివరాలు 

ఆత్మాహుతి దాడులకు మహిళలు 

నూతన మహిళా బ్రిగేడ్‌లో ప్రధానంగా జైషే కమాండర్ల భార్యలను సభ్యులుగా చేర్చనున్నారు. అదనంగా, బహవల్‌పూర్‌, కరాచీ, ముజఫరాబాద్‌, కోట్లీ, హరీపూర్‌ వంటి ప్రాంతాల్లో ఆర్థికంగా పేదరికంలో ఉన్న మహిళలను కూడా చేరుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఐసిస్‌, బోకో హరామ్‌, హమాస్‌ వంటి ఉగ్ర ముఠాలు మహిళలను నియమించుకొని వారిని ఆత్మాహుతి దాడులకు ఉపయోగించుకున్న ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు జైషే కూడా ఆ పంథానే అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.