Masood Azhar : జైషే మహ్మద్ అధినేత మృతి.. బాంబు దాడిలో ప్రాణం విడిచిన మసూద్ అజహర్!
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజహర్ మృతి చెందారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడిలో అజహర్ హతమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్'లో గత కొన్ని నెలలుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో ఉగ్రవాదులు హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి మాస్టర్ మైండ్ మసూద్ అజహర్(Masood Azhar)పై జరిగిన బాంబు దాడిలో అతడు మరణించినట్లు సామాజిక మాధ్యమాల్లో సమాచారం. ఉదయం 5 గంటల సమయంలో పాక్‌లోని భవల్‌పూర్ మసీదు నుంచి మసూద్ తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఘటనలో మసూద్ అజహర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు కథనాలు ప్రసారం అవుతున్నాయి.
1995లో భారత్ అరెస్ట్ చేసింది..
మసూద్‌పై బాంబు దాడి జరిగినట్లుగా పేర్కొంటూ వైరల్ అవుతున్న వీడియో పాతదని తెలుస్తోంది. మసూద్ అజహర్‌ను ఇప్పటికే ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.అతడు పాక్‌లోనే ఉన్నట్లు ఇప్పటికీ ఆ దేశం అంగీకరించలేదు. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహ్మద్ ఉగ్రముఠా అధినేత అయిన మసూద్,భారత్‌లో పలు భీకర దాడులకు సూత్రధారి. 1995లో భారత్ అతడిని అరెస్ట్ చేయగా 1999లో కొందరు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి అతడిని విడిపించుకున్నారు. అనంతరం జైషే ఉగ్రసంస్థను స్థాపించి 2001లో పార్లమెంట్‌పై జరిగిన ఉగ్రదాడి,2008లో ముంబయిలో జరిగిన బాంబు పేలుళ్లలోనూ నిందితుడిగా ఉన్నాడు. 2019లో జమ్మూకశ్మీర్‌లో పుల్వామాలో సైనికుల కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 40మంది జవాన్లు ప్రాణాలు కోల్పోవడం వెనుక మసూద్ హస్తం ఉందని భారత్ ప్రకటించింది.