
US: సౌత్ కరోలినా లిటిల్ రివర్ ప్రాంతంలో కాల్పుల కలకలం.. 11 మందికి తీవ్ర గాయలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని దక్షిణ కరోలినాలో కాల్పుల ఘటన కలకలం రేపింది. లిటిల్ రివర్ అనే ప్రాంతంలో ఆదివారం రాత్రి సుమారు 9.30గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఊహించని ఘటనతో స్థానికులు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీశారు. ఈ కాల్పుల్లో మొత్తం 11మంది గాయపడినట్లు హారీ కౌంటీ పోలీస్ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సేవలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. అనేక అంబులెన్స్‌లు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని బాధితులను తరలించాయి. నివాస ప్రాంతాల మధ్య జరిగిన ఈ కాల్పులకు కారణమైన వారెవరన్నది ఇంకా స్పష్టతకు రాలేదని అధికారులు పేర్కొన్నారు.
వివరాలు
దక్షిణ కరోలినాలో అరాచకశక్తుల ఆగడాలు
త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. ఇటీవలి కాలంలో దక్షిణ కరోలినాలో అరాచకశక్తుల ఆగడాలు బాగా పెరిగిపోతున్నాయి. గతంలో కూడా అదే రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మిర్టిల్ బీచ్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే మరో ఘటనలో నార్త్ ఓషన్ బౌలేవార్డ్ లో ఓ వ్యక్తి అనూహ్యంగా ప్రజలపై కాల్పులకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో కూడా పలువురు గాయాలపాలయ్యారు. ఆ తర్వాత పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఆ దుండగుడు అక్కడికక్కడే మరణించాడని అధికారులు తెలిపారు.