LOADING...
Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియం పారిస్‌లో భారీ చోరీ
ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియం పారిస్‌లో భారీ చోరీ

Louvre Museum: ప్రపంచ ప్రసిద్ధ మ్యూజియం పారిస్‌లో భారీ చోరీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 19, 2025
09:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గాంచిన మోనాలిసా (Mona Lisa) అసలు చిత్రం ఉంచిన ప్రసిద్ధ పారిస్ లోవ్ర్ మ్యూజియంలో (Louvre Museum) భారీ దొంగతనం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున ఈ చోరీ జరిగినట్లు ఫ్రాన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి రాచిడా దాతి (France Culture Minister Rachida Dati) ప్రకటించారు. ఈ ఘటనలో మ్యూజియం సిబ్బందిలో ఎవరికీ గాయాలు కాలేదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతానికి దర్యాప్తు కొనసాగుతోందని, ఆ కారణంగా మ్యూజియాన్ని తాత్కాలికంగా మూసివేశామని తెలిపారు. మ్యూజియంలోని ఒక విభాగంలో నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో, దుండగులు ఆ ప్రాంతం ద్వారా లోపలికి ప్రవేశించినట్టు స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

Details

తొమ్మిది వస్తువులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం

ఆపై వారు సరుకు రవాణాకు ఉపయోగించే ఎలివేటర్‌ ద్వారా అపోలో గ్యాలరీలోకి చేరారని సమాచారం. నెపోలియన్ కాలానికి చెందిన వస్తువులు, విలువైన ఆభరణాలు ఉంచిన ఆ గ్యాలరీలోని అద్దాలను పగుల గొట్టి మొత్తం తొమ్మిది వస్తువులను ఎత్తుకెళ్లినట్టు చెప్పారు. ఈ ఘటనపై అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లోవ్ర్ మ్యూజియంలో ఇంతకు ముందు కూడా చోరీలు, ప్రయత్నాలు నమోదయ్యాయి. 1911లో, అక్కడ పనిచేసిన మాజీ సిబ్బంది విన్సెంజో పెరుగ్గియా మోనాలిసా చిత్రాన్ని దొంగిలించాడు. దాదాపు రెండేళ్లు సాగిన విచారణ అనంతరం అధికారులు అతని నుంచి చిత్రాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నారు. 1983లో మరొకసారి మ్యూజియం నుంచి రెండు పురాతన కవచాలు దొంగలించారు.

Details

రోజుకు 30వేల మంది సందర్శన

దాదాపు నలభై ఏళ్ల తర్వాత వాటిని అధికారులు కనుగొన్నారు. మెసపటోమియా, ఈజిప్ట్‌కు చెందిన అరుదైన కళాఖండాలు, పలు రాజవంశాలకు చెందిన చిత్రాలు, శిల్పాలు వంటి అపూర్వ సంపదలకు ఈ మ్యూజియం నిలయంగా నిలుస్తోంది. మోనాలిసా తో పాటు వీనస్ డి మిలో, వింగ్డ్ విక్టరీ ఆఫ్ సమోత్రేస్, వెర్సైల్లెస్ డయానా వంటి ప్రపంచ ప్రఖ్యాత కళావస్తువులు ఇక్కడ ఉన్న ఆకర్షణల్లో ప్రధానమైనవి. రోజుకు దాదాపు 30 వేల మంది సందర్శకులు ఈ మ్యూజియాన్ని దర్శిస్తుంటారు.