Influential Muslims list: 'ది ముస్లిం 500'లో పాక్ నేతలకు అగ్రస్థానం.. మునీర్, షరీఫ్‌కు అరుదైన గౌరవం!
ఈ వార్తాకథనం ఏంటి
సొంత దేశంలో ఆర్థిక సంక్షోభం,రాజకీయ అనిశ్చితి వంటి సమస్యలతో పాకిస్థాన్ సతమతమవుతున్నప్పటికీ.. ఆ దేశ నాయకులకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావవంతమైన ముస్లింల జాబితాలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీమ్ మునీర్,ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ సంయుక్తంగా అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 50 మంది ముస్లింల జాబితాలో వీరిద్దరికీ తొలి స్థానం లభించడం ఆసక్తికరంగా మారింది. జోర్డాన్‌కు చెందిన రాయల్ ఇస్లామిక్ స్ట్రాటజిక్ స్టడీస్ సెంటర్ (RISSC) తాజాగా విడుదల చేసిన 'ది ముస్లిం 500' 2027 నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది.
వివరాలు
మక్కా జాయింట్ డిఫెన్స్ ఒప్పందమే కారణమా?
ఈ జాబితాలో పాకిస్థాన్ నేతలతో పాటు సౌదీ అరేబియా రాజు సల్మాన్, ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగన్ కూడా అగ్రస్థానాన్ని పంచుకున్నారు.
గతంలో 450 మంది ప్రభావవంతమైన వ్యక్తుల సాధారణ జాబితాలో ఉన్న అసీమ్ మునీర్, షెహబాజ్ షరీఫ్.. ఏకంగా అగ్రస్థానానికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
గత ఆగస్టులో పాకిస్థాన్,సౌదీ అరేబియా,టర్కీ మధ్య కుదిరిన 'మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్' ఈ గుర్తింపునకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.
ఈ ఒప్పందం ప్రకారం.. మూడు దేశాల్లో ఏదైనా ఒక దేశంపై దాడి జరిగితే, మిగిలిన రెండు దేశాలపైనా దాడి జరిగినట్లుగా పరిగణిస్తారు.
వివరాలు
దేశాన్ని తెరవెనుక నుంచి నడిపించే అసలైన శక్తిగా అసీమ్ మునీర్
ఈ కూటమి ద్వారా సౌదీ అరేబియా ఆర్థిక సంపద, టర్కీ సాంకేతిక పరిజ్ఞానం, పాకిస్థాన్ సైనిక సామర్థ్యం ఒకే వేదికపైకి వచ్చాయని నివేదిక విశ్లేషించింది.
ఇదే సమయంలో పాకిస్థాన్ వ్యవహారాల్లో అసీమ్ మునీర్ కీలక పాత్రను కూడా నివేదిక ప్రస్తావించింది.
దేశాన్ని తెరవెనుక నుంచి నడిపించే అసలైన శక్తిగా ఆయనను అభివర్ణించింది.
అయితే ఆయనపై ఉన్న రాజకీయ అణచివేత ఆరోపణలు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలు వ్యవహారాలను కూడా నివేదికలో ప్రస్తావించడం గమనార్హం.
వివరాలు
టాప్-50లో భారత్ నుంచి ఒక్కరే..
ఇక ఈ ప్రతిష్ఠాత్మక జాబితాలో భారత్ నుంచి ఒక్కరికే చోటు దక్కింది.
జమియత్ ఉలేమా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ 18వ స్థానంలో నిలిచారు.
పౌరసత్వ హక్కుల పరిరక్షణ, మైనారిటీల భద్రత, వక్ఫ్ ఆస్తుల సంరక్షణ కోసం ఆయన చేస్తున్న న్యాయపోరాటాలను నివేదిక ప్రశంసించింది.
మరోవైపు టాప్-50 జాబితాలో చోటు దక్కకపోయినా, మిగిలిన 450 మంది ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో పలువురు భారతీయ ప్రముఖులు ఉన్నారు.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ, ఇస్లామిక్ మత బోధకుడు జకీర్ నాయక్‌తో పాటు బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తదితరులకు ఈ జాబితాలో చోటు లభించింది.