LOADING...
Pakistan: మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్.. 
మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్..

Pakistan: మధ్యవర్తిత్వం పేరుతో పాకిస్థాన్ డబుల్ గేమ్.. 

వ్రాసిన వారు Sirish Praharaju
May 12, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మరోసారి ఆ దేశం అనుసరిస్తున్న గోప్య రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో శాంతి ప్రయత్నాలు చేస్తున్నట్టు బయటకు కనిపించిన పాకిస్థాన్, మరోవైపు ఇరాన్‌కు రహస్య సహాయం అందించిందనే సమాచారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అమెరికా దాడుల నుంచి తమ సైనిక వనరులను రక్షించుకునేందుకు ఇరాన్ తన యుద్ధ విమానాలను పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి రహస్యంగా తరలించినట్టు అమెరికాకు చెందిన సీబీఎస్ వార్తాసంస్థ వెల్లడించింది.

వివరాలు 

నూర్ ఖాన్ వైమానిక స్థావరంలో ఆర్‌సీ-130 గూఢచారి విమానం

అమెరికా అధికారుల సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని సీబీఎస్ ప్రసారం చేసింది. ఆ నివేదిక ప్రకారం.. ఏప్రిల్ ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ అనేక సైనిక విమానాలను నూర్ ఖాన్ వైమానిక స్థావరానికి తరలించింది. అక్కడ ఉంచిన విమానాల్లో ఇరాన్ వైమానిక దళానికి చెందిన ఆర్‌సీ-130 గూఢచారి విమానం కూడా ఉన్నట్టు సమాచారం. అమెరికా దాడుల ముప్పు నుంచి రక్షించుకునేందుకు మిగిలిన సైనిక విమానాలను కూడా పాకిస్థాన్‌లో భద్రపరిచినట్టు నివేదిక పేర్కొంది.

వివరాలు 

ఆరోపణలను ఖండించిన పాక్ 

ఈ వార్తలపై అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహం తీవ్రంగా స్పందించారు. ఈ సమాచారం నిజమైతే పాకిస్థాన్‌ను మధ్యవర్తి దేశంగా చూడాల్సిన విధానాన్ని మళ్లీ పరిశీలించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్ విషయంలో పాకిస్థాన్ వైఖరి ఎలా ఉంటుందో తెలిసిందేనని, అందువల్ల ఈ వ్యవహారంలో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని విమర్శించారు. మరోవైపు ఈ ఆరోపణలను పాకిస్థాన్ పూర్తిగా ఖండించింది. నూర్ ఖాన్ వైమానిక స్థావరం జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతంలో ఉందని, అక్కడ రహస్యంగా యుద్ధ విమానాలను దాచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్థాన్‌లో కూడా ఇరాన్ విమానాలు ఉన్నాయనే ప్రచారం సాగినా, తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఆ వార్తలను తోసిపుచ్చారు.

Advertisement

వివరాలు 

ప్రపంచవ్యాప్తంగా చర్చకు పాకిస్థాన్ ద్వంద్వ వ్యూహం

ఒకవైపు తన ప్రధాన ఆయుధ సరఫరాదారు అయిన చైనాతో పాటు పొరుగు దేశం ఇరాన్‌తో సంబంధాలు దెబ్బతినకుండా చూసుకుంటూనే, మరోవైపు అమెరికాతో అనుబంధాలను కొనసాగించేందుకు పాకిస్థాన్ అనుసరిస్తున్న ద్వంద్వ వ్యూహం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

Advertisement