Super commuter: ఉద్యోగం కోసం ప్రతిరోజూ 700 కి.మీ ప్రయాణించే సూపర్-మామ్!
ఈ వార్తాకథనం ఏంటి
మీరు ఆఫీసుకు ఎలా వెళ్తారు? ఎంత దూరం ప్రయాణిస్తారు? అనే ప్రశ్నకు మనం సాధారణంగా ఏ బస్సులోనో, ఏ కార్లోనో వెళ్తానని సమాధానం ఇస్తాం.
ఎక్కువగా రోజుకు 20-30 కిలోమీటర్లు, రానూ పోనూ కలిపి 50-60 కిలోమీటర్ల వరకు ఉంటుందనేదే సాధారణంగా వినిపించే సమాధానం.
కానీ ఇదే ప్రశ్న ఓ మహిళను అడిగితే? ఆమె సమాధానం మాత్రం ఆశ్చర్యపరిచేలా ఉంటుంది—రోజూ 700 కిలోమీటర్లు! అదీ విమానంలో ప్రయాణిస్తూ!
ఆమె మలేసియాలో నివాసం ఉంటున్న భారతీయ సంతతికి చెందిన మహిళ.
ఇటీవల ఆమె ప్రయాణ విధానం చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రతిరోజూ 700 కిలోమీటర్ల ప్రయాణం చేస్తూ విధులకు హాజరవుతుండటంతో, ఆమెను "సూపర్ కమ్యూటర్" (సూపర్ ప్రయాణికురాలు) అని పిలుస్తున్నారు.
వివరాలు
4 గంటలకే రోజువారీ ప్రయాణం ప్రారంభం!
ఆమె పేరు రాచెల్ కౌర్. ఎయిర్ ఏసియా కంపెనీలో ఫైనాన్స్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
ఇటీవల CNA ఇన్‌సైడర్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అసాధారణమైన ప్రయాణపు సంగతిని వివరించారు.
ఆ ఇంటర్వ్యూతో ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
రాచెల్ కౌర్‌కు 11, 12 ఏళ్ల వయసుగల ఇద్దరు పిల్లలు. ఆమె మలేషియాలోని పెనాంగ్‌లో నివసిస్తూ, కౌలాలంపూర్‌లో పనిచేస్తున్నారు.
గతంలో ఆమె ఆఫీసుకు దగ్గరగా అద్దె ఇంట్లో ఉండేవారు. అలా ఉండగా వారానికి ఒక్కరోజు మాత్రమే పిల్లల్ని చూడగలిగేవారు.
వివరాలు
నెలకు రూ. 42,000 ఖర్చు బదులు రూ. 28,000!
ఇదే కారణంగా ఆమె నిర్ణయం మార్చుకుని రోజూ విమాన ప్రయాణం చేయడం మొదలుపెట్టారు.
ఉదయాన్నే 4 గంటలకు నిద్రలేచి, 5 గంటలకల్లా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు.
5:55కి విమానం ఎక్కి, 7:45కల్లా ఆఫీసుకు చేరుకుంటారు. విధులు ముగించుకుని రాత్రి 8 గంటలలోపు తిరిగి ఇంటికి చేరుకుంటారు.
ఒకప్పటి కంటే ప్రస్తుతం ప్రయాణంతో ఎక్కువ ఆదా అవుతోందని రాచెల్ అంటున్నారు.
కౌలాలంపూర్‌లో అద్దె ఇంట్లో ఉండినప్పుడు నెలకు 474 డాలర్లు (సుమారు రూ. 42,000) ఖర్చవుతుండేది.
కానీ ఇప్పుడు విమాన ప్రయాణం చేసినా 316 డాలర్లు (రూ. 28,000) మాత్రమే ఖర్చవుతోందని తెలిపారు.
వివరాలు
పిల్లలతో గడిపే క్షణాలే..
అంతేకాదు, ప్రయాణ సమయంలో తనకు ఇష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ, ఆఫీసుకు వెళ్లే ముందు కొంతసేపు నడవడం అలవాటు చేసుకున్నానని చెప్పారు.
తన ప్రయాణ విధానం గురించి తెలుసుకున్నవారు ఆశ్చర్యపోతున్నారని, కొందరు 'నీకేమైనా పిచ్చా?' అని ప్రశ్నిస్తున్నారని చెప్పిన రాచెల్.. పిల్లలతో గడిపే క్షణాలే తనకెంతో ఆనందాన్నిస్తాయని తెలిపారు.