Melania Trump: ఎప్స్టీన్ అనుబంధంపై వస్తున్న వార్తలను తిరస్కరించిన మెలానియా
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తనను వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్‌తో ముడిపెడుతున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వార్తలన్నీ పూర్తిగా అసత్యమని, తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి చేస్తున్న దురుద్దేశపూర్వక ప్రయత్నాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం వైట్‌హౌస్‌లో చేసిన ప్రకటనలో, తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నవారికి నైతిక విలువలు, గౌరవం లేవని ఆమె విమర్శించారు. అలాంటి ఆరోపణలను తాను పట్టించుకోనప్పటికీ, తన గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని స్పష్టం చేశారు. ఈ నిరాధార ఆరోపణలపై తన న్యాయవాదులతో కలిసి పోరాడి విజయాన్ని సాధించానని వెల్లడించారు.
వివరాలు
బాధితులకు న్యాయం కల్పించాల్సిన అవసరం ఉంది: మెలానియా
ఈ సందర్భంగా బాధితులకు న్యాయం కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వారికి తమ గళాన్ని వినిపించే అవకాశం కల్పించేందుకు కాంగ్రెస్ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బాధితుల కోసం బహిరంగ విచారణ నిర్వహించి, వారి వాంగ్మూలాలను అధికారికంగా నమోదు చేయాలని కోరారు. ప్రతి మహిళకు తాము కోరుకుంటే బహిరంగంగా తమ అనుభవాలను వెల్లడించే అవకాశం ఇవ్వాలని, అప్పుడు మాత్రమే నిజాలు వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
మాక్స్‌వెల్‌కు ఈమెయిల్
అయితే జెఫ్రీ ఎప్స్టీన్ లేదా గిస్లైన్ మాక్స్‌వెల్ తో తనకు ఎలాంటి వ్యక్తిగత స్నేహం లేదని మెలానియా స్పష్టం చేశారు. న్యూయార్క్, ఫ్లోరిడా ప్రాంతాల్లో జరిగే సామాజిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు మాత్రమే కలిసేవారమని తెలిపారు. మాక్స్‌వెల్‌కు పంపిన ఒక ఈమెయిల్ ప్రత్యుత్తరాన్ని సాధారణ ఉత్తరప్రత్యుత్తరంగా మాత్రమే అభివర్ణించారు. ఇటీవల వరకు ఈ వివాదం నుంచి ట్రంప్ యంత్రాంగం బయటపడుతున్నట్లు కనిపించినప్పటికీ, మెలానియా చేసిన ఈ అనూహ్య ప్రకటనతో విషయం మళ్లీ రాజకీయ చర్చకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.