Iran: అమెరికాకు ఆంక్షల వ్యసనం పట్టింది.. ఇరాన్ తీవ్ర విమర్శలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు ఆంక్షలు విధించడం ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది. తమ దేశంపై అమెరికా పదేపదే ఆంక్షలు విధించడాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తప్పుబట్టారు. ఆంక్షల ద్వారా ఇరాన్‌ను 'ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాం' అంటూ అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. దౌత్యపరమైన మార్గాల్లో ఆశించిన లక్ష్యాలను సాధించలేనప్పుడు అమెరికా ఆంక్షల వైపు వెళ్తోందని బఘాయీ ఆరోపించారు. ఒకసారి విధించిన ఆంక్షలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోతే.. వాటిని మరింత కఠినతరం చేస్తోందని అన్నారు. ఇలా చేయడం మొదట అలవాటుగా మారి, చివరకు వ్యసనంగా మారిందని ఎక్స్ వేదికగా విమర్శించారు.
వివరాలు
ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం అమెరికాకు సాధ్యం కాదు: బఘాయీ
ఆంక్షలతో ఇరాన్‌ను లొంగదీసుకోవడం అమెరికాకు సాధ్యం కాదని బఘాయీ స్పష్టం చేశారు.
దశాబ్దాలుగా ఇలాంటి ఆంక్షలను తమ దేశం ఎదుర్కొంటూనే ఉందని గుర్తుచేశారు.
అమెరికా నాయకత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తే.. ప్రస్తుత సంక్షోభం నుంచి గౌరవప్రదంగా బయటపడేందుకు ఉన్న అవకాశాలను వారే నాశనం చేసుకుంటారని హెచ్చరించారు.
మరోవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ ఆరోపణలు చేశారు.
ఇరాన్ ప్రభుత్వం డిజిటల్ ఆస్తులు, రహస్య బ్యాంకింగ్ వ్యవస్థలపై ఆధారపడుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇరాన్‌కు చెందిన అక్రమ ఆర్థిక నెట్‌వర్క్‌లను గుర్తించి వాటిని పూర్తిగా ధ్వంసం చేస్తామని స్పష్టం చేశారు.
వివరాలు
ఇరాన్ సైన్యంలో కీలక నియామకాలు
ఇరాన్ సైన్యంలో పలు కీలక నియామకాలు జరిగాయి. సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు.
మేజర్ జనరల్ అలీ అబ్దొల్లాహీని సాయుధ దళాల చీఫ్‌గా నియమించారు. కియుమర్స్ హైదారికి డిప్యూటీ చీఫ్ బాధ్యతలు అప్పగించారు.
అదేవిధంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కమాండర్‌గా మేజర్ జనరల్ అహ్మద్ వాహిదీని నియమించారు.
ఆయనకు డిప్యూటీగా మోస్తఫా ఇజాదీ బాధ్యతలు చేపట్టారు.
మొజ్తబా ఖమేనీ సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇరాన్ సైన్యంలో చేపట్టిన తొలి ప్రధాన నియామకాలు ఇవే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
దేశ సైనిక వ్యవస్థలో కీలక పదవులకు కొత్త అధికారులను నియమించడం ద్వారా ఆయన నాయకత్వంలో చేపట్టిన తొలి ముఖ్యమైన మార్పులుగా ఇవి నిలిచాయి.