Loading...
Mexico Church: చర్చి సమీపంలో బాణసంచా పేలుడు.. మెక్సికోలో 10 మంది మృతి, 64 మందికి గాయాలు
చర్చి సమీపంలో బాణసంచా పేలుడు.. మెక్సికోలో 10 మంది మృతి, 64 మందికి గాయాలు

Mexico Church: చర్చి సమీపంలో బాణసంచా పేలుడు.. మెక్సికోలో 10 మంది మృతి, 64 మందికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 07, 2026
11:38 am

ఈ వార్తాకథనం ఏంటి

మెక్సికోలో మతపరమైన వేడుకల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాణసంచా సామగ్రికి నిప్పంటుకుని భారీ పేలుడు సంభవించడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 64 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం మెక్సికోలోని తేమాస్కాల్సింగో పట్టణంలో జరిగినట్లు అధికారులు సోమవారం వెల్లడించారు. తేమాస్కాల్సింగోలోని 'నుయెస్ట్రా సెనోరా డె లా లూజ్' చర్చి సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. మతపరమైన వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా ప్రదర్శనను చూసేందుకు వందలాది మంది అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో బాణసంచా సామగ్రికి మంటలు అంటుకుని ఒక్కసారిగా పేలుడు సంభవించింది.

వివరాలు 

పొగతో నిండిన ప్రాంతం

పేలుడు తీవ్రతతో పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.

ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

వాటిలో పేలుడు జరిగిన ప్రాంతంలోని శిథిలాల మధ్య ప్రాణాలతో ఉన్నవారి కోసం స్థానికులు వెతుకుతున్న దృశ్యాలు కనిపించాయి.

తేమాస్కాల్సింగో పట్టణంలో సుమారు 66 వేల మంది నివసిస్తున్నారు.

మెక్సికో రాజధాని మెక్సికో సిటీకి వాయవ్య దిశలో ఈ పట్టణం దాదాపు 160 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పేలుడుకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు.

వివరాలు 

గతంలోనూ బాణసంచా ప్రమాదాలు

ఈ ప్రమాదంపై మెక్సికో రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం దర్యాప్తు చేపట్టింది.

పేలుడుకు దారితీసిన పరిస్థితులు, బాణసంచా సామగ్రి వద్ద మంటలు ఎలా చెలరేగాయన్న అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

మెక్సికోలో మతపరమైన వేడుకలతో పాటు వివిధ కార్యక్రమాల్లో బాణసంచా వినియోగించడం సాధారణంగా కనిపిస్తుంది.

అయితే ఇలాంటి వేడుకల్లో బాణసంచా కారణంగా ప్రమాదాలు గతంలోనూ సంభవించాయి.

నాలుగేళ్ల క్రితం హిడాల్గో రాష్ట్రంలోని హ్యూహుట్లా మున్సిపాలిటీ పరిధిలోని ఓ గ్రామంలో బాణసంచా కారణంగా భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు.

ADVERTISEMENT