Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో మరో వాణిజ్య నౌకపై దాడి.. దెబ్బతిన్న ఇంజిన్ రూమ్.. సిబ్బందిలో ఒకరికి గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధిలో మరో వాణిజ్య నౌకపై దాడి జరిగింది. దీంతో ఈ కీలక జలమార్గంలో ఉద్రిక్తతలు మరోసారి ఒక్కసారిగా పెరిగాయి. ఒమన్ తీరానికి సమీపంలో జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఓ వాణిజ్య నౌకను మంగళవారం తెల్లవారుజామున లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. ఈ ఘటనలో నౌక ఇంజిన్ గది పాక్షికంగా దెబ్బతినగా.. సిబ్బందిలో ఒకరు గాయపడ్డారు. బ్రిటిష్ సైన్యానికి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీఓ) ఈ విషయాన్ని ధ్రువీకరించింది. యూకేఎంటీఓ వెల్లడించిన వివరాల ప్రకారం.. గాయపడిన సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై వెంటనే పూర్తి సమాచారం అందుబాటులోకి రాలేదు. ఘటన జరిగిన వెంటనే ఒమన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. దాడికి సంబంధించిన పరిస్థితులపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు
ఇప్పటివరకు ఏ సంస్థా ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించలేదు
అయితే ఈ ఘటన వల్ల సముద్ర పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఏర్పడలేదని అధికారులు స్పష్టం చేశారు. నౌక నుంచి చమురు లీకేజీ కూడా జరగలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా.. దాడికి గురైన వాణిజ్య నౌక పేరు, దాని వివరాలు, నౌకలో రవాణా చేస్తున్న సరుకు వంటి అంశాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.
అలాగే ఈ దాడికి బాధ్యులెవరన్నది కూడా స్పష్టతకు రాలేదు. ఇప్పటివరకు ఏ సంస్థా ఈ ఘటనకు తామే బాధ్యులమని ప్రకటించలేదు.
వివరాలు
నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధం విధించింది
ఫిబ్రవరి చివర్లో ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిగిన నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఆంక్షలు, ఆంక్షల తరహా పరిమితులు తీవ్రంగా కొనసాగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు రవాణాలో దాదాపు ఐదో వంతు ఈ కీలక జలమార్గం గుండానే సాగుతుంది.
దీంతో హర్మూజ్‌లో ఏర్పడే ఏ చిన్న ఉద్రిక్తత అయినా అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
మరోవైపు.. నౌకల రాకపోకలపై అమెరికా విధించిన దిగ్బంధం కూడా కొనసాగుతోంది.