LOADING...
Heat dome: యూరప్‌ను కాల్చేస్తున్న 'హీట్ డోమ్'.. బ్రిటన్, ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలు
బ్రిటన్, ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలు

Heat dome: యూరప్‌ను కాల్చేస్తున్న 'హీట్ డోమ్'.. బ్రిటన్, ఫ్రాన్స్‌లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
03:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశాలు ఎండలతో అల్లాడుతున్న వేళ యూరప్‌లో భారీ హీట్‌వేవ్‌ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బ్రిటన్‌, ఐర్లాండ్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాల్లో మే నెలలో ఎన్నడూ లేని స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తర ఆఫ్రికా నుంచి వచ్చిన వేడి గాలులు పశ్చిమ యూరప్‌పై ఏర్పడిన అధిక పీడన వ్యవస్థ కింద చిక్కుకుపోవడంతో 'హీట్ డోమ్‌' పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. స్పెయిన్‌లో ఈ వారం చివరికి 38 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతలు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇటలీలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బహిరంగ పనులపై ఆంక్షలు అమలు చేస్తున్నారు.

వివరాలు 

బ్రిటన్‌లో రికార్డు ఎండలు

యునైటెడ్ కింగ్‌డమ్‌లో చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైన మే రోజు ఇదేనని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. లండన్‌ నైరుతి ప్రాంతంలోని క్యూ గార్డెన్స్‌లో 34.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదై పాత రికార్డును దాదాపు రెండు డిగ్రీల తేడాతో అధిగమించింది. సాధారణంగా ఈ సమయంలో 17 నుంచి 18 డిగ్రీల మధ్య ఉండే లండన్‌ ఉష్ణోగ్రత ఒక్కసారిగా పెరగడంతో ప్రజలు, పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. "ఇక్కడి వాతావరణం చిన్న నరకంలా ఉంది.. చాలా వేడిగా ఉంది" అంటూ 10 ఏళ్ల లిజా నిజారీ వ్యాఖ్యానించింది.

వివరాలు 

వాతావరణ మార్పుల ప్రభావమేనా?

మానవ చర్యల వల్ల పెరుగుతున్న వాతావరణ మార్పుల కారణంగానే ఇలాంటి తీవ్ర హీట్‌వేవ్‌లు, వరదలు, కరువులు ఎక్కువవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బ్రిటన్‌ వాతావరణ శాఖకు చెందిన నిపుణుడు గ్రెగ్ డ్యుహర్స్ట్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణోగ్రతలు క్లైమేట్‌ చేంజ్‌కు స్పష్టమైన ఉదాహరణ అని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి వేడి సాధారణమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇటీవల బ్రిటన్‌లోని వాతావరణ సలహా సంస్థలు కూడా కీలక హెచ్చరికలు జారీ చేశాయి. ప్రస్తుతం ఉన్న పాఠశాలలు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు సరిపోవని, వాటిని మార్చాల్సిన అవసరం ఉందని సూచించాయి. 2022 వేసవిలో బ్రిటన్‌ చరిత్రలో తొలిసారి 40 డిగ్రీల మార్క్‌ను దాటిన విషయం తెలిసిందే.

Advertisement

వివరాలు 

ఫ్రాన్స్‌లో హీట్‌వేవ్ అలర్ట్

ఇక ఐర్లాండ్‌లో కూడా మే నెలలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బరోలో ఆర్థర్స్ సీట్ కొండ సమీపంలో గడ్డి మంటలు చెలరేగాయి. ఫ్రాన్స్‌లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పలు నగరాల్లో ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలవడంతో ఎనిమిది ప్రాంతాలకు హీట్‌వేవ్ అలర్ట్ జారీ చేశారు. బెర్గెరాక్ పట్టణంలో 34.7 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. నాంట్స్‌, ఆంజర్స్‌ నగరాల్లో కూడా అసాధారణ వేడి కనిపించింది. బ్రిట్టనీ ప్రాంతంలో 32 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని దక్షిణ ప్రాంతాల్లో 37 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

Advertisement

వివరాలు 

ఎండల ఎఫెక్ట్.. ఇటలీలో పనివేళలపై పరిమితులు

పారిస్‌లో ఈ ఏడాది తొలిసారిగా ఉష్ణోగ్రత 30 డిగ్రీలను దాటింది. వేడి కారణంగా క్రీడా ఈవెంట్ల సమయంలో కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పారిస్‌లో జరిగిన 10 కిలోమీటర్ల రేసులో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో పోటీలో 10 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. స్పెయిన్‌లో కూడా ఈ వారం మొత్తం తీవ్ర ఎండలు కొనసాగనున్నాయని అక్కడి వాతావరణ సంస్థ హెచ్చరించింది.

వివరాలు 

ఎండల ఎఫెక్ట్.. ఇటలీలో పనివేళలపై పరిమితులు

ముఖ్యంగా దక్షిణ పశ్చిమ ప్రాంతాల్లో రాత్రి సమయంలో కూడా ఉష్ణోగ్రతలు అధికంగానే ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఇటలీలోని లాజియో ప్రాంత ప్రభుత్వం అత్యవసర నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువసేపు పనిచేయాల్సిన వ్యవసాయం, నిర్మాణం, లాజిస్టిక్స్‌ రంగాల్లో బహిరంగ పనులపై పరిమితులు విధించింది. గత ఏడాది అమలు చేసిన హీట్‌వేవ్ నిబంధనలను ఈసారి సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించింది.

Advertisement