Pentagon watchdog: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం.. తొలిసారి అధికారిక లెక్కలు విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్‌తో జరిగిన యుద్ధం వల్ల అమెరికాకు ఎదురైన నష్టంపై ఆ దేశ ప్రభుత్వ వాచ్‌డాగ్ తొలిసారిగా అధికారిక నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ పోరులో అమెరికా కోల్పోయిన సైనిక పరికరాలు, దెబ్బతిన్న స్థావరాలు, దౌత్యపరమైన ఖర్చులు, ఆయుధ నిల్వల కొరత తదితర అంశాలను నివేదికలో సమగ్రంగా వివరించారు. జూన్ 30 వరకు నమోదైన నష్టాలను పెంటగాన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఈ నివేదికలో లెక్కగట్టారు.
వివరాలు
ధ్వంసమైన సైనిక స్థావరాలు
నివేదిక ప్రకారం.. కువైట్, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాక్, ఒమన్, జోర్డాన్‌లలో ఉన్న అమెరికా సైనిక స్థావరాల్లోని వందలాది భవనాలు ఇరాన్ దాడుల్లో ధ్వంసమయ్యాయి లేదా దెబ్బతిన్నాయి.
వీటితో పాటు నాలుగు F-15E ఫైటర్ జెట్లు, ఒక F-35A, ఒక A-10, 12 KC-135 ఇంధన రీఫ్యూయలింగ్ విమానాలు, 30కి పైగా MQ-9 డ్రోన్లు సహా డజన్ల కొద్దీ విమానాలు నాశనమైనట్టు నివేదిక పేర్కొంది.
వివరాలు
33.4 బిలియన్ డాలర్ల నష్టం
జూన్ 30 నాటికి అమెరికా రక్షణ శాఖకు సుమారు 33.4 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.
ఇందులో యుద్ధంలో వినియోగించిన ఆయుధాల విలువ 22.3 బిలియన్ డాలర్లు కాగా.. ధ్వంసమైన సైనిక పరికరాల నష్టం 3.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
అయితే, జులై చివరి నాటికి యుద్ధానికి సంబంధించిన మొత్తం వ్యయం 37.5 బిలియన్ డాలర్లకు చేరిందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ గతంలో కాంగ్రెస్‌కు వెల్లడించారు.
దౌత్య కార్యాలయాలపైనా దాడులు
ఇరాన్ దాడుల ప్రభావం అమెరికా దౌత్య కార్యాలయాలపైనా పడింది. 600కు పైగా దాడుల కారణంగా దౌత్య కార్యాలయాలకు సుమారు 184 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్టు నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
ఆయుధ నిల్వలను భర్తీ చేసేందుకు మూడేళ్లు
ఈ యుద్ధం కారణంగా అమెరికా ఆయుధాగారాల్లో వ్యూహాత్మక కొరత ఏర్పడినట్టు నివేదిక స్పష్టం చేసింది.
అత్యాధునిక క్షిపణుల నిల్వలను యుద్ధానికి ముందు ఉన్న స్థాయికి తిరిగి తీసుకురావడానికి సుమారు మూడేళ్లు పట్టవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నట్టు తెలిపింది.
యుద్ధ నష్టంపై స్వతంత్ర సంస్థలు ఇంతకంటే ఎక్కువ అంచనాలు వెల్లడించినప్పటికీ.. అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికల్లో ఇదే అత్యంత సమగ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.