Missouri: నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు, కోర్టు సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి
అమెరికాలోని మిస్సౌరీలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఒక ఇంటిలో ప్రాసెస్ సర్వర్ తొలగింపు నోటీసును అందజేయడానికి వచ్చిన కోర్టు ఉద్యోగి, పోలీసు అధికారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. మరొక అధికారి తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ప్రాణాలతో బయటపడే అవకాశం ఉందని పోలీస్ చీఫ్ ఆడమ్ డస్ట్‌మాన్ తెలిపారు. నోటీసులు అందజేసేందుకు ప్రయత్నిస్తున్న డ్రెక్సెల్ మాక్ అనే కోర్టు ఉద్యోగి, ఇద్దరు పోలీసులపై కాల్పులు జరిపాడని ఆయన వెల్లడించారు. ఈ కాల్పుల విషయాన్ని సంఘటన స్థలంలోనే ఉన్న.. మరో సివిల్ ప్రాసెస్ ఉద్యోగి పోలీస్ కంట్రోల్ రూమ్ 911కి కాల్ చేసి చెప్పినట్లు వెల్లడించారు.
పోలీసుల అదుపులో అనుమానితుడు
ఈ ఘటనలో తమ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కాడి అలెన్ అనే తమ సహోద్యోగిని కూడా కోల్పోయినట్లు పోలీస్ చీఫ్ ఆడమ్ డస్ట్‌మాన్ వెల్లడించారు. అయితే గాయపడిన పోలీసు అధికారి పేరును అయన చెప్పడానికి ఇష్టపడలేదు. కాడి అలెన్ ఒక హీరో అని ఆడమ్ డస్ట్‌మాన్ అభివర్ణించారు. అలెన్ మరణంపై పోలీసు డిపార్ట్‌మెంట్‌ను తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినట్ల వెల్లడించారు. అలాగే, కాల్పులకు పాల్పడిన అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అయితే నిందితుడికి కూడా స్వల్పంగా గాయాలైనట్లు పేర్కొన్నారు.