LOADING...
Ali And Mojtaba Khamenei: ఇరాన్‌లో తండ్రి-కుమారుడి నాయకత్వం: అలీ ఖమేనేయి vs మొజ్తబా ఖమేనేయి
ఇరాన్‌లో తండ్రి-కుమారుడి నాయకత్వం: అలీ ఖమేనేయి vs మొజ్తబా ఖమేనేయి

Ali And Mojtaba Khamenei: ఇరాన్‌లో తండ్రి-కుమారుడి నాయకత్వం: అలీ ఖమేనేయి vs మొజ్తబా ఖమేనేయి

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 11, 2026
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ప్రకటించిన రోజు, టెహ్రాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్ రిపబ్లిక్‌కు మద్దతుదారులు రాత్రివేళ గుమికూడి "అల్లాహు అక్బర్" అంటూ నినాదాలు చేశారు. అంటే "దేవుడు మహత్తరుడు" అని అర్థం. రాష్ట్ర టెలివిజన్‌లో ఆయన పేరుతో ప్రయోగించిన క్షిపణుల దృశ్యాలు ప్రసారం అయ్యాయి. వాటిలో ఒక క్షిపణిపై "సయ్యద్ మొజ్తబా... మీ సేవలో సిద్ధంగా ఉన్నాం" అనే వాక్యం కూడా కనిపించింది. అయితే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో మొజ్తబాకు వ్యతిరేక నినాదాలు వినిపించాయి. ఈ పరిణామం ఇరాన్ రాజకీయాల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వం తండ్రి నుంచి కుమారుడికి మారినట్టుగా కనిపిస్తోంది.

వివరాలు 

అయతుల్లా అలీ ఖమేనేయి రెండో కుమారుడు మొజ్తబా ఖమేనేయి

అయతుల్లా అలీ ఖమేనేయి రెండో కుమారుడైన మొజ్తబా ఖమేనేయి,అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో తండ్రి మరణించిన తర్వాత ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం 56 ఏళ్ల వయస్సున్నఆయన,ఇరాన్ చరిత్రలో మూడో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన నియామకం అత్యంత వివాదాస్పదంగా మారింది. యుద్ధ పరిస్థితులు,అంతర్జాతీయ ఒత్తిళ్ల మధ్య ఆయన అధికారంలోకి రావడం గమనార్హం. దీంతో ఒక ప్రశ్న ముందుకు వస్తోంది .. దశాబ్దాల పాటు తండ్రి నీడలో పనిచేసిన మొజ్తబా, ఆయన తండ్రి అలీ ఖమేనేయి కంటే ఎంత భిన్నంగా ఉంటారని? ఈ తేడాను అర్థం చేసుకోవాలంటే,అధికార పదవుల ద్వారా ఎదిగిన నాయకుడు,అధికారానికి వెనుక నుంచి ప్రభావం చూపిన కుమారుడు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పరిశీలించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

అలీ ఖమేనేయి 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు

లాంకాస్టర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సైమన్ మేబన్ మాట్లాడుతూ, "సీనియర్ ఖమేనేయి రాజకీయంగా బలంగా స్థిరపడ్డ నాయకుడు. ఆయన అధ్యక్షుడిగా పనిచేసి ఇస్లామిక్ రిపబ్లిక్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత సుప్రీం లీడర్‌గా ఎదిగారు" అని చెప్పారు. అలీ ఖమేనేయి 1989లో సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టే ముందు ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఇస్లామిక్ విప్లవం తర్వాత, అలాగే ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఆయన జాతీయ స్థాయిలో ప్రముఖుడిగా ఎదిగారు. అయినప్పటికీ ఆయన నియామకం అప్పట్లో కూడా వివాదాస్పదంగానే నిలిచింది. "మతపరమైన అర్హతల పరంగా చూస్తే ఆయన అత్యంత అర్హత కలిగిన అభ్యర్థి కాదు. అయినప్పటికీ ఆయనను ఎంపిక చేశారు," అని ప్రొఫెసర్ మేబన్ వివరించారు.

Advertisement

వివరాలు 

తెర వెనుక ప్రభావం

"కానీ కుమారుడు మాత్రం పూర్తిగా భిన్నమైన మార్గంలో ఎదిగాడు." మొజ్తబా ఖమేనేయి కూడా అయతుల్లా హోదాకు సరిపడ మతపరమైన అర్హతలు లేవని చెబుతున్నారు. అయితే ఆ లోటును తర్వాత భర్తీ చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆయనను 'అయతుల్లా' అని పిలవడం ప్రారంభించారు. చాలా సంవత్సరాల పాటు మొజ్తబా ఖమేనేయి సాధారణ ప్రజలకు పెద్దగా తెలియని వ్యక్తిగానే ఉన్నారు. ఆయన ఎప్పుడూ ప్రభుత్వ పదవిలో పనిచేయలేదు. బహిరంగ ప్రసంగాలు లేదా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వలేదు. ప్రజల్లోకి వచ్చిన ఫోటోలు, వీడియోలు కూడా చాలా తక్కువే. కానీ ఈ నిశ్శబ్దం వెనుక భారీ ప్రభావం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

తెర వెనుక ప్రభావం

2000ల చివరలో వికీలీక్స్ విడుదల చేసిన అమెరికా దౌత్యపత్రాల ప్రకారం,దౌత్య వర్గాల్లో మొజ్తబాను "పవర్ బీహైండ్ ది రోబ్స్".. అంటే అధికారానికి వెనుక నుంచి ప్రభావం చూపే వ్యక్తిగా పేర్కొన్నారు. ఇరాన్ పాలక వ్యవస్థలో ఆయనను ప్రభావశీలిగా భావించేవారని కూడా ఆ పత్రాల్లో పేర్కొన్నారు. ప్రొఫెసర్ మేబన్ మాట్లాడుతూ,మొజ్తబా ఎదుగుదల వెనుక ప్రధాన కారణం ఇదేనని చెప్పారు. "ఆయనకు అధికార పదవుల అనుభవం లేదు.తండ్రిలా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన అనుభవం కూడా లేదు. కానీ తెర వెనుక నుంచి రాజకీయ వ్యవహారాలను నడిపే అనుభవం మాత్రం చాలానే ఉంది,"అని చెప్పారు. ఇలా సంవత్సరాల పాటు వ్యవస్థలో పనిచేయడం వల్ల ఇరాన్ అధికార కేంద్రాలపై ఆయనకు బలమైన ప్రభావం ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు.

వివరాలు 

IRGC పాత్ర

ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)పై ఆయన ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. 1979లో విప్లవాన్ని రక్షించడానికి ఏర్పాటు చేసిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)ఇప్పుడు ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన సంస్థల్లో ఒకటిగా మారింది. ఇది భారీ సైనిక శక్తితో పాటు పెద్ద ఆర్థిక వ్యవస్థను కూడా నియంత్రిస్తుంది. మొజ్తబా ఖమేనేయికి ఈ సంస్థతో సంబంధాలు చాలా కాలంగా ఉన్నాయి. ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఆయన యువకుడిగా ఉండగానే ఈ సంస్థలో చేరారు. 1969 సెప్టెంబర్ 8న ఇరాన్ ఈశాన్య ప్రాంతంలోని మష్హద్ నగరంలో మొజ్తబా జన్మించారు. అలీ ఖమేనేయి ఆరుగురు పిల్లల్లో ఆయన రెండో కుమారుడు. టెహ్రాన్‌లోని అలవి పాఠశాలలో చదివిన తర్వాత,ఇరాక్‌తో జరిగిన యుద్ధంలో కొంతకాలం సైన్యంలో సేవలందించారు.

వివరాలు 

1999లో మొజ్తబా ఖమేనేయి మతపరమైన విద్య

ఆ ఎనిమిదేళ్ల యుద్ధం తర్వాత ఇరాన్ ప్రభుత్వానికి అమెరికా,పాశ్చాత్య దేశాలపై అనుమానం మరింత పెరిగింది. ఎందుకంటే ఆ యుద్ధ సమయంలో పాశ్చాత్య దేశాలు ఇరాక్‌కు మద్దతు ఇచ్చాయి. 1999లో మొజ్తబా ఖమేనేయి ఇరాన్‌లోని పవిత్ర నగరం ఖోమ్‌కు వెళ్లి మతపరమైన విద్యను కొనసాగించారు. అప్పుడే ఆయన మొదటిసారి మత గురువుల దుస్తులు ధరించడం ప్రారంభించారు.

వివరాలు 

వివాదాస్పద ఎదుగుదల

ఇటీవలి నెలల్లో ఇరాన్ అధికార వర్గాలకు దగ్గరగా ఉన్న మీడియా సంస్థలు మొజ్తబాను "అయతుల్లా"గా పేర్కొనడం ప్రారంభించాయి. ఆయన మతపరమైన నమ్మకాన్ని బలపర్చే ప్రయత్నంగా దీనిని విశ్లేషకులు చూస్తున్నారు. అయితే ఆయన అధికారంలోకి రావడం ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. 1979 విప్లవం తర్వాత ఏర్పడిన ఇస్లామిక్ రిపబ్లిక్ సిద్ధాంతం వారసత్వ పాలనను తిరస్కరిస్తోంది. కుటుంబ వారసత్వం కాకుండా మతపరమైన అర్హతలు, నాయకత్వ సామర్థ్యాల ఆధారంగా సుప్రీం లీడర్‌ను ఎంపిక చేయాలని ఆ సిద్ధాంతం చెబుతుంది. అయినా కూడా మొజ్తబా ఖమేనేయి చాలా కాలంగా భవిష్యత్ వారసుడిగా భావించబడుతున్నారు.

వివరాలు 

కఠిన వైఖరి?

ప్రొఫెసర్ మేబన్ అభిప్రాయం ప్రకారం మొజ్తబా తన తండ్రి కంటే మరింత కఠిన వైఖరి కలిగిన నాయకుడిగా మారే అవకాశముంది. "ఆయన చేసిన రాజకీయ వ్యూహాలు, ఆయన పని చేసిన విధానం చూస్తే తండ్రి కంటే కొంచెం ఎక్కువ కఠిన వైఖరి కలిగి ఉండవచ్చు," అని ఆయన అన్నారు. అలాగే ఆయన అధికారంలోకి వచ్చిన సమయం కూడా కీలకంగా మారొచ్చు. అలీ ఖమేనేయి ఇరాన్-ఇరాక్ యుద్ధం ముగిసిన తర్వాత అధికారంలోకి వచ్చారు. కానీ మొజ్తబా మాత్రం నేరుగా యుద్ధ పరిస్థితుల్లో నాయకత్వం చేపట్టారు. ఇది వారి ప్రపంచ దృక్పథాన్ని ప్రభావితం చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

అమెరికా - ఇజ్రాయెల్ స్పందన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొజ్తబా ఖమేనేయి నియామకాన్ని సమర్థించలేదు. ఇజ్రాయెల్ కూడా తీవ్ర విమర్శలు చేసింది. ఈ రెండు దేశాలు ఆయనను ఇరాన్‌కు కీలక ప్రత్యర్థులుగా చూస్తున్నాయి. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు అయినా "నిర్దిష్ట లక్ష్యంగా తీసుకునే వ్యక్తి" అవుతారని హెచ్చరించారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, "నాయకుడి ముఖం మారొచ్చు. కానీ భయానక పాలన మాత్రం మారదు. మొజ్తబా ఖమేనేయి తన తండ్రి అణచివేత, రక్తపాతం వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు" అని పేర్కొంది.

వివరాలు 

అమెరికా - ఇజ్రాయెల్ స్పందన

ఇక మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్‌లకు ఇది ఇరాన్‌లో సిద్ధాంతపరమైన కఠిన వైఖరి కొనసాగుతుందనే సంకేతంగా కనిపిస్తోంది. ఇటీవల జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మొజ్తబా కుటుంబ సభ్యుల్లో పలువురు మరణించినట్లు కూడా సమాచారం. అందులో ఆయన తల్లి మంసూరె ఖోజస్తె బఘెర్జాదెహ్, భార్య జహ్రా హద్దాద్-అదెల్, ఒక కుమారుడు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మొజ్తబా ఖమేనేయి నాయకత్వం ఇరాన్ రాజకీయాల్లో కొత్త దశను ప్రారంభించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆయన ఎంపిక అమెరికా, ఇజ్రాయెల్‌లకు గట్టి సందేశం ఇవ్వడమేనని కూడా నిపుణులు చెబుతున్నారు.

Advertisement