Loading...
Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేని ఎక్కడ?.. సౌదీ కథనంతో మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ
మొజ్తాబా ఖమేని ఎక్కడ?.. సౌదీ కథనంతో మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ

Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేని ఎక్కడ?.. సౌదీ కథనంతో మళ్లీ తెరపైకి వచ్చిన చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
02:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌కు చెందిన నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఇరాన్‌లోనే ఉన్నారని కొందరు చెబుతుండగా,మరికొందరు చికిత్స కోసం రష్యాలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే విషయంపై ఇప్పటివరకు ఇరాన్ ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాకు చెందిన అల్ హదాత్ వార్తా సంస్థ సంచలన కథనం ప్రచురించింది. ఆ కథనం ప్రకారం మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఇరాన్‌లో లేరని పేర్కొంది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ భద్రతా దళాలు కూడా ధ్రువీకరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

వివరాలు 

మొజ్తాబా ఆచూకీపై మరిన్ని సందేహాలు

అయితే ఆయన ఏ దేశంలో ఉన్నారు, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారనే విషయంపై మాత్రం స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదని తెలిపింది.

ఫిబ్రవరి 28న అమెరికా ఇరాన్‌పై నిర్వహించిన దాడిలో మొజ్తాబా తండ్రి అయతొల్లా ఖమేనితో పాటు కుటుంబ సభ్యులు మరణించినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

అదే ఘటనలో మొజ్తాబా ఖమేని గాయపడినట్లు కూడా ప్రచారం జరిగింది. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు.

ఇటీవల జరిగిన తన తండ్రి, కుటుంబ సభ్యుల అంత్యక్రియలకు కూడా ఆయన హాజరు కాకపోవడంతో ఆయన ఆచూకీపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదిలా ఉండగా, అమెరికా మరియు ఇజ్రాయెల్‌కు తగిన గుణపాఠం చెబుతామని మొజ్తాబా ఖమేని ఇటీవల విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నట్లు సమాచారం.

వివరాలు 

ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా పాల్గొనడం అమెరికాకు ఇష్టంలేదు 

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మరోవైపు, ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా పాల్గొనడం అమెరికాకు ఇష్టంలేదని కూడా అల్ హదాత్ తన కథనంలో పేర్కొంది.

ఇరాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగుతున్నప్పటికీ, పరిస్థితులు మరింత ఉద్రిక్తం కాకుండా ఉండాలని అమెరికా భావిస్తున్నట్లు వెల్లడించింది.

అదే సమయంలో, ఇరాన్‌లో బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల అధికార వర్గాల్లో విభేదాలు పెరిగినట్లు కూడా ఆ కథనం పేర్కొంది.

ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు, ఇతర రాజకీయ నాయకత్వానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్నట్లు సమాచారం.

ఈ అంతర్గత విభేదాలు కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT