LOADING...
Mojtaba Khamenei: మోజ్తాబా ఖమేనీ హెచ్చరిక.. శత్రువులకు ఘోర పరాజయం తప్పదన్న సందేశం!
మోజ్తాబా ఖమేనీ హెచ్చరిక.. శత్రువులకు ఘోర పరాజయం తప్పదన్న సందేశం!

Mojtaba Khamenei: మోజ్తాబా ఖమేనీ హెచ్చరిక.. శత్రువులకు ఘోర పరాజయం తప్పదన్న సందేశం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 19, 2026
09:51 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్-అమెరికా మధ్య దౌత్య చర్చల ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. ఈ పరిణామాల మధ్య ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ కీలక హెచ్చరికలు చేశారు. శత్రువులకు గట్టి బుద్ధి చెప్పేందుకు తమ నౌకాదళం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జాదే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరుపక్షాలు ఉమ్మడి నిర్ణయానికి వచ్చే వరకు అమెరికాతో ఎటువంటి చర్చలు జరగవని తెలిపారు. ఏ పరిస్థితుల్లోనూ తమ దేశ హక్కులను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఓడరేవులపై అమెరికా విధించే ఎలాంటి దిగ్బంధనాన్ని టెహ్రాన్ అంగీకరించదని, వాషింగ్టన్ ఆదేశాలకు కట్టుబడి ఉండబోదని తెలిపారు.

వివరాలు

మాటల యుద్ధం కొనసాగుతోంది

ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు అమెరికాకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, యూఎస్ నౌకాదళం కదలికలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికాకు చెందిన విమాన వాహక నౌక USS గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ మళ్లీ పశ్చిమాసియా జలాల్లోకి ప్రవేశించింది. ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన ఈ నౌక మరమ్మతుల అనంతరం మళ్లీ విధుల్లో చేరింది. నెలరోజుల పాటు తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న ఈ యుద్ధనౌక, సూయజ్ కాలువ దాటి ఎర్ర సముద్రంలోకి చేరినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

వివరాలు

దక్షిణాఫ్రికా తీర ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం

ఈ నౌకతో పాటు యుఎస్ఎస్ మహాన్, యుఎస్ఎస్ విన్‌స్టన్ ఎస్. చర్చిల్ అనే రెండు డిస్ట్రాయర్లు కూడా ప్రయాణిస్తున్నట్లు సమాచారం. మరోవైపు USS జార్జ్ H.W. బుష్ అనే మరో అమెరికా విమాన వాహక నౌక కూడా పశ్చిమాసియా వైపు కదులుతోంది. ప్రస్తుతం ఇది దక్షిణాఫ్రికా తీర ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే USS అబ్రహం లింకన్ ఇప్పటికే అరేబియా సముద్రంలో మోహరించి ఉంది. అమెరికా మళ్లీ పశ్చిమాసియా ప్రాంతంలో భారీ స్థాయిలో నౌకాదళాన్ని మోహరిస్తుండటంతో, ప్రాంతీయ పరిస్థితులు ఎటు దారి తీస్తాయోనన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో నెలకొంది.

Advertisement