విదేశాల్లో తొలి ఐఐటీ ఏర్పాటుకు ఒప్పందం.. జాంజిబార్‌లో ఐఐటీ మద్రాస్ క్యాంపస్
భారతదేశం బయట తొలి ఐఐటీ క్యాంపస్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్, జాంజిబార్ అధ్యక్షుడు హుస్సేన్ అలీ మవినీ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి. భారత విద్యా మంత్రిత్వ శాఖ, ఐఐటీ మద్రాస్ తో జాంజిబార్ విద్య, వృత్తి శిక్షణ మంత్రిత్వశాఖ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. తూర్పుఆఫ్రికా తీరంలోని టాంజానియా ద్వీపసమూహం జాంజిబార్‌లో ఈ ఐఐటీ ఏర్పాటుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే టాంజానియాలోని జాంజిబార్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్ ఆధ్వర్యంలోనే తొలి విదేశీ ఐఐటీని జాంజిబార్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది.