LOADING...
Mount Everest: ఒక్కరోజులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది.. నేపాల్‌ మార్గంలో కొత్త రికార్డు
నేపాల్‌ మార్గంలో కొత్త రికార్డు

Mount Everest: ఒక్కరోజులో ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన 274 మంది.. నేపాల్‌ మార్గంలో కొత్త రికార్డు

వ్రాసిన వారు Sirish Praharaju
May 22, 2026
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest)ఎవరెస్ట్‌పై మరో కొత్త రికార్డు నమోదైంది. నేపాల్‌ మార్గం ద్వారా బుధవారం ఒక్కరోజులోనే 274 మంది పర్వతారోహకులు శిఖరాన్ని చేరుకుని చరిత్ర సృష్టించారు. ఈ ఏడాది ఎవరెస్ట్‌ ఎక్కే సీజన్ ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, వాతావరణం అనుకూలంగా మారడంతో భారీ సంఖ్యలో పర్వతారోహకులు శిఖరాన్ని అధిరోహించేందుకు బయల్దేరారు. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన ఎవరెస్ట్‌ అధిరోహణ ఉదయం నుంచి దాదాపు 11 గంటల పాటు కొనసాగిందని నేపాల్‌ టూరిజం శాఖ అధికారులు తెలిపారు. ఇంతకుముందు 2019 మే 22న నేపాల్‌ మార్గం ద్వారా 223 మంది ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించగా.. తాజాగా 274 మంది చేరుకుని ఆ రికార్డును బద్దలు కొట్టారు.

వివరాలు 

500 మంది విదేశీ పర్వతారోహకులకు అనుమతులు

ఈసారి దాదాపు 500 మంది విదేశీ పర్వతారోహకులకు అనుమతులు ఇవ్వడం కూడా మరో రికార్డుగా నిలిచింది. సాధారణంగా ప్రతి విదేశీ క్లైంబర్‌తో కనీసం ఒక నేపాలీ గైడ్‌ కూడా వెళ్తాడు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోల్లో మంచుతో కప్పుకున్న ఎవరెస్ట్‌ పర్వతంపై పొడవాటి క్యూల్లో పర్వతారోహకులు కనిపించారు. సముద్ర మట్టానికి 8 వేల మీటర్ల ఎత్తులో ఉండే ప్రాంతాన్ని"డెత్‌ జోన్‌"గా పిలుస్తారు. అక్కడ ఆక్సిజన్‌ స్థాయిలు చాలా తక్కువగా ఉండటంతో ఎక్కువసేపు ఉండటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుమతి ఫీజులను ఇటీవల 11 వేల డాలర్ల నుంచి 15 వేల డాలర్లకు పెంచినా,ఎవరెస్ట్‌ ఎక్కాలనే ఆసక్తి మాత్రం తగ్గడం లేదు.

వివరాలు 

కొత్త రికార్డులు

రద్దీ వల్ల ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, సరిపడా ఆక్సిజన్‌ ఉంటే సమస్య కాదని పర్వతారోహణ సంస్థలు చెబుతున్నాయి. ఇదే సమయంలో పలువురు పర్వతారోహకులు కొత్త రికార్డులు కూడా సృష్టించారు. ప్రముఖ నేపాలీ గైడ్‌ కామి షెర్పా 32వసారి ఎవరెస్ట్‌ శిఖరాన్ని చేరుకుని తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. అలాగే "మౌంటెన్‌ క్వీన్‌"గా పేరుగాంచిన లాక్పా షెర్పా 11వసారి ఎవరెస్ట్‌ ఎక్కి మహిళల్లో అత్యధిక అధిరోహణల రికార్డు నెలకొల్పింది. రెండు కాళ్లు కోల్పోయిన రష్యన్‌ పర్వతారోహకుడు రుస్తమ్ నబీవ్(Rustam Nabiev)కూడా కృత్రిమ కాళ్లు లేకుండానే శిఖరాన్ని చేరి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

Advertisement

వివరాలు 

సీజన్‌లో విషాదాలు

అయితే ఈ సీజన్‌లో విషాదాలు కూడా చోటుచేసుకున్నాయి. ఎత్తైన ప్రాంతాల్లో శ్వాస సమస్యల కారణంగా నేపాల్‌కు చెందిన పర్వతారోహకుడు బిజయ్‌ ఘిమిరే మృతి చెందాడు. మరోవైపు ఫురా గ్యాల్జెన్‌ షెర్పా మంచులో జారి లోయలో పడిపోగా, లక్ఫా డెండి షెర్పా బేస్‌క్యాంప్‌కు వెళ్తుండగా ప్రాణాలు కోల్పోయాడు.

Advertisement